Sun Dec 22 2024 22:25:18 GMT+0000 (Coordinated Universal Time)
కష్ట సుఖాల్లోనే కాదు.. చావులోనూ ఒకరినొకరు వీడలేదు !
నిజమైన భార్యా భర్తల అనుబంధానికి అర్థం చెప్పే ఇలాంటి ఘటనే తెలంగాణలోని ములుగు జిల్లాలో వెలుగుచూసింది.
ఆలుమగలంటే.. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలని.. ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉండాలంటుంటారు పెద్దలు. జీవితాంతం అలాగే కలిసుంటామని పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలకు కట్టుబడి.. ఎంత కష్ట నష్టాలొచ్చినా తట్టుకుని.. కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం ఇద్దరూ చేస్తారు. ఒకరికి కష్టమొస్తే.. మరొకరు తట్టుకోలేరు. చిన్న నొప్పి అనిపించినా.. కట్టుకున్న వారి ప్రాణం అల్లాడిపోతుంటుంది. వారి ప్రాణమే పోతే.. వారిలో సగభాగమైన జీవిత భాగస్వామి కూడా తనువు చాలిస్తారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదు. నిజమైన భార్యా భర్తల అనుబంధానికి అర్థం చెప్పే ఇలాంటి ఘటనే తెలంగాణలోని ములుగు జిల్లాలో వెలుగుచూసింది.
భార్య చనిపోయిన గంటకే..
అప్పటివరకూ వాళ్లిద్దరూ కలిసి మెలిసి ఉన్నారు. ఆడుతూ పాడుతూ.. కాలం గడిపేస్తున్నారు. కానీ.. ఉన్నట్లుండి భార్య తనువు చాలించింది. భార్య లేదు.. ఇక రాదన్న ఊహనే తట్టుకోలేకపోయిన ఆ భర్త.. భార్య చనిపోయిన గంట వ్యవధిలోనే కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికులందరి కళ్లల్లో కన్నీళ్లు తెప్పించింది. ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకాపేట గ్రామానికి చెందిన మాసపత్రి రాజయ్య (70) జిల్లా కేంద్రంలోని సింగరేణి సంస్థలో ట్రామర్గా చేసి 2017లో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు భార్య సావిత్రి (65) నలుగురు కుమారులున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో రాజయ్య దంపతులకు బంధువులు ఉండడంతో ఐదేళ్ల క్రితం ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. డిసెంబర్ 24 శుక్రవారం ఉదయం స్వరూపకు గుండెపోటు రావడంతో కిందపడిపోయారు.
చావులోనూ అన్యోన్యత చాటిన దంపతులు
ఏమైందో ఏమోనని చుట్టుపక్కలవారు వచ్చి చూసేసరికే సావిత్రి ప్రాణం విడిచింది. భార్య ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక గుండెలవిసేలా రోధించారు రాజయ్య. భార్య లేని జీవితం ఎందుకు అనుకున్నాడేమో.. అతని గుండె కూడా ఆగిపోయింది. భార్య మృతదేహం వద్ద రోదిస్తోన్న రాజయ్యకు గుండెపోటు రావడంతో.. కుటుంబసభ్యులు స్థానిక వెంకటాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్ప టికే ఆయన మృతి చెందారని తెలిపారు. దీంతో నలుగురు కొడుకులు కలిసి.. తల్లిదండ్రులిద్దరి అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. కష్టసుఖాల్లోనే కాదు.. చావులోనూ అన్యోన్యతను చాటుకున్న ఆ దంపతులను చూసి బంధువులంతా కంటతడి పెట్టుకున్నారు.
Next Story