Thu Dec 19 2024 22:43:31 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ ప్రమాణానికి చంద్రబాబు హాజరవుతారా? హాట్ టాపిక్
రేవంత్ రెడ్డి రేపటి ప్రమాణస్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారా? లేదా? అన్న చర్చ జరుగుతుంది.
రేవంత్ రెడ్డి రేపటి ప్రమాణస్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారా? లేదా? అన్న చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి తాను సీఎంగా రేపు ఎల్.బి. స్టేడియంలో బాధ్యతలను చేపట్టనున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకార సభకు చంద్రబాబుకు ప్రత్యేకంగా రేవంత్ ఆహ్వానం పంపుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్ లో కాంగ్రెస్ పరాజయం పాలయింది. అక్కడ అధికారంలోకి వచ్చి ఉంటే చంద్రబాబు రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే వారన్న వాదన ఒకవైపు వినిపిస్తుంది.
టీడీపీ నుంచే...
మరోవైపు రేవంత్ తాను ఇచ్చిన అవకాశంతోనే రాజకీయంగా ఎదిగారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన తన పార్టీని పోటీకి దూరంగా ఉంచినట్లు కూడా వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ కు లాభం చేకూర్చడానికే పోటీ నుంచి తప్పుకున్నట్లు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా అనేక మార్లు తనకు రాజకీయ జన్మ నిచ్చిన గురువుగా చంద్రబాబును భావిస్తారు. అనేక సార్లు బాహాటంగానే రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నుంచే తన రాజకీయ ఎదుగుదల సాధ్యమయిందని ఆయన ఇప్పటికీ అంగీకరిస్తారు.
ఏపీ నేతలు...
తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన వెంటనే అనేక మంది ఏపీకి చెందిన టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. ఇక రేవంత్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత కూడా ఏపీ టీడీపీ నేతలు పెద్దయెత్తున శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. టీడీపీ నుంచి ఎదిగిన రేవంత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడాన్ని వారు స్వాగతించారు. దీంతో అసలు రేవంత్ చంద్రబాబుకు తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఏపీలో త్వరలో ఎన్నికల దృష్ట్యా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాకపోవచ్చని కూడా చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. ఆయన వస్తారా? రారా అన్నది రేపు తేలనుంది.
Next Story