Sun Dec 22 2024 18:42:34 GMT+0000 (Coordinated Universal Time)
KTR : అవసరమైతే కేసీఆర్తోనైనా కయ్యం... ఈసారి మాత్రం ఒప్పుకునేది లేదట
రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలకంగా మారనున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఏ ముహూర్తాన నియమితులయ్యారో.. పెద్దగా కలసి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడంతో పాటు తాను నమ్మిన నేతలు పార్టీని విడిచి పెట్టడం కూడా ఆయనను ఒకింత షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమం నుంచి తన వెంట నడుస్తున్న వారిని కూడా కాదని అప్పటికప్పుడు వచ్చిన వారికి అందలం ఎక్కించిన తన తండ్రి కేసీఆర్ ను ఏమీ అనలేక.. ఆయనకు నేరుగా చెప్పలేక సతమతమవుతున్నారంటున్నారు. గత ఎన్నికల్లోనూ సిట్టింగ్ లను మార్చాలని కేటీఆర్ చేసిన సూచనను కేసీఆర్ పట్టించుకోక పోవడం వల్లనే పార్టీకి ఓటమి సంభవించిందని ఇప్పటికీ నమ్ముతున్నారు.
అందుకే ఓటమి...
అయితే కేసీఆర్ కు ఉన్న రాజకీయ అనుభవం దృష్ట్యా ఆయనతో నేరుగా మాట్లాడి ఒప్పించలేకపోతున్న నేతల్లో కేటీఆర్ కూడా ఒకరు. పైకి తమ పార్టీ అధినేత గురించి ఎక్కడా మాట్లాడకపోయినా.. కేసీఆర్ చేసిన తప్పులు కారణంగానే తాము గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని ఇప్పటికీ ఆయన మధనపడుతూనే ఉన్నారు. మూడోసారి గెలిచి ఉంటే కేటీఆర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారు. తనచెల్లి కవిత జైలు పాలయ్యే వారు కాదు. ఇవన్నీ తన తండ్రి తీసుకున్న నిర్ణయాలేనని ఆయన బలంగా నమ్ముతున్నారు కూడా. అందుకే వచ్చే ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక బాధ్యత అంతా తానే భుజాన వేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
పార్టీ కోసం పనిచేసే వారిని...
ఇప్పటి నుంచి పార్టీకోసం పాటుపడే వారిని గుర్తించి వారిని అభ్యర్థులుగా బరిలోకి దింపి పార్టీని విజయతీరం వైపు తీసుకెళ్లాలన్న కసితో కేటీఆర్ ఉన్నారు. అవసరమైతే తన తండ్రి కేసీఆర్ తో మాట్లాడి ఒప్పించగలనని, ఈసారి కేసీఆర్ విషయంలోనూ తాను వెనకడుగు వేసేది లేదని, ఎలాంటి భయం లేకుండా తన అభిప్రాయాలను ఆయన ముందు ఉంచుతానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా సర్వేలు చేయించి అభ్యర్థుల జాబితాను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తానే ఖరారు చేసే బాధ్యతను భుజాన వేసుకోవాలని కేటీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో ఎలాంటి శషభిషలకు తావివ్వకుండా తాను ఇకపై కఠిన నిర్ణయాలు తీసుకుంటానని కూడా ఆయన చెబుతున్నట్లు తెలిసింది.
వదలి వెళ్లిన వారిని...
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీడి వెళ్లిన వారు తిరిగి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసినా తాను అడ్డుకుంటానని గట్టిగానే కేటీఆర్ ముఖ్యనేతలకు భరోసా ఇస్తున్నారట. ఈసారి తాను కేసీఆర్ తో కొట్లాడయినా నమ్మక ద్రోహులను దూరంగా ఉంచుతానని, మళ్లీ వాళ్లను పార్టీలోకి చేర్చుకుని క్యాడర్ లో అయోమయం కలిగించనని కూడా హామీ ఇస్తున్నట్లు తెలిసింది. అన్నింటా తానే అయి వ్యవహరిస్తానని, ఇకపై ఎవరైనా తనను నేరుగా కలసి నియోజకవర్గంలో సమస్యలు, పార్టీ పరిస్థితిని గురించి వివరించవచ్చని ఆయన నేతలకు చెబుతుండటంతో కొంత కేటీఆర్ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకుంటే.. సగం సమస్యలు పరిష్కారమయినట్లేనని, తర్వాత తాను పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు గులాబీ పార్టీలో చర్చించుకుంటున్నారు.
Next Story