Mon Dec 23 2024 07:46:49 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణకు "డెంగీ" ముప్పు... హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
తెలంగాణకు డెంగీ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది
తెలంగాణకు డెంగీ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. వాతావరణం మార్పులతో డెంగీ వ్యాధి తెలంగాణలో విస్తరించే అవకాశముందని తెలిపింది. గతంలో కంటే కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే అవకాశాలున్నాయని, అందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ప్రధాన వేరియంట్లు నాలుగు తెలంగాణలో కనిపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం కూడా ఆందోళనకు దారి తీస్తుంది. ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని కోరింది.
దోమల ఉత్పత్తి కాకుండా
దోమల ఉత్పత్తి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రాత్రి వేళ మాత్రమే కాకుండా పగటి పూట కూడా ఫాగింగ్ చేయాలని సూచించింది. నీరు నిల్వ ఉంచకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని కోరింది. దోమల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు ప్రజలు పాటించాలని కోరింది. గతంలో కంటే ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమయింది. దోమల నివారణకు ఫాగింగ్ చేయడంతో పాటుగా మురుగు కాల్వలపై రసాయనాలు చల్లి దోమల ఉత్పత్తి పెరగకుండా చూడాలని ఇప్పటికే అన్ని మున్సిపల్ శాఖ అధికారులను వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది.
నాలుగు వేరియంట్లు...
తెలంగాణలో నాలుగు వేరియంట్లు డీఈఎన్వీ1, డీఈఎన్వీ2, డీఈఎన్వీ3, డీఈఎన్వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకే వందలాది కేసులు నమోదయిన విషయాన్ని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తు చేసింది. డెంగీ బాధితులు ఎక్కువయ్యే అవకాశముండటంతో అందుకు అవసరమైన వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కేవలం తప్పు అధికారుల మీద మాత్రమే నెపం నెట్టకుండా ప్రజలు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. డెంగీ లక్షణాలు ఏదైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపింది. మొత్తం మీద తెలంగాణలో డెంగీ కేసులు ఎక్కువగా ఈ ఏడాది నమోదవుతాయన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది.
Next Story