Thu Nov 14 2024 22:12:44 GMT+0000 (Coordinated Universal Time)
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని.. ఆఫీసులో పాము వదిలేసిన యువకుడు
అల్వాల్ భారతి నగర్ లో ఉన్న ఓ పాడు పడిన ఇంట్లో బాగా చెట్లు, పొదలు పెరిగి పాములు బయటకు వస్తున్నాయి. అయితే పాడుబడిన..
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి ఎక్కువగా పాములు వస్తున్నాయని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోకపోవడంతో ఓ యువకుడు పామును తీసుకెళ్లి వార్డు కార్యాలయంలో వదిలిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలో గత వారంరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొందరి ఇళ్లల్లోకి వరద నీరు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో వరదనీటితో పాటు పాములు కూడా సంచరిస్తున్నాయి.
అల్వాల్ భారతి నగర్ లో ఉన్న ఓ పాడు పడిన ఇంట్లో బాగా చెట్లు, పొదలు పెరిగి పాములు బయటకు వస్తున్నాయి. అయితే పాడుబడిన భవనంలో నుండి పాములు తమ ఇంటిలోకి వస్తున్నాయని పక్కింటి వారు అల్వాల్ వార్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినా కూడా అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన సంపత్ అనే యువకుడు ఒక పామును తీసుకువెళ్లి వార్డు ఆఫీసులో వదిలేశాడు. అది చూసి వార్డు ఆఫీసు సిబ్బంది తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
ప్రైవేట్ ప్రాపర్టీ కావడంతో చెట్ల పొదలను క్లీన్ చేసే అధికారం తమకు లేదని అందుకే అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా కూడా వారు ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్లే తాను పామును తీసుకువచ్చి వార్డు కార్యాలయంలో వదిలివేయడం జరిగిందని ఆ వ్యక్తి వివరణ ఇస్తూ మళ్లీ పామును తీసుకొని నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టిన ఘటన నిన్న మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకుంది. ఆ విషయం కాస్త బయటపడటంతో జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.
Next Story