Fri Dec 20 2024 05:53:45 GMT+0000 (Coordinated Universal Time)
Peacock Curry: ఎంచక్కా నెమలి కూర వండి.. వీడియోను అప్లోడ్ చేశాడు
వన్యప్రాణులను కాపాడాలంటూ ఓ వైపు ప్రభుత్వం, అధికారులు, ఎన్జీవోలు పిలుపును ఇస్తున్నప్పటికీ
వన్యప్రాణులను కాపాడాలంటూ ఓ వైపు ప్రభుత్వం, అధికారులు, ఎన్జీవోలు పిలుపును ఇస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం ఏకంగా వాటిని వండేసి యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు. వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB) చట్టవిరుద్ధంగా వేటాడటం, రక్షిత వన్యప్రాణులను వండడాన్ని అడ్డుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా.. అనేక యూట్యూబ్ ఛానెల్‌లలో అడవి పంది, జింకలు, బల్లి, నెమలి వంటి వంటకాలకు సంబంధించిన వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి.
కోడం ప్రణయ్‌కుమార్ అనే యూట్యూబర్ తన ఛానెల్లో ‘సాంప్రదాయ పీకాక్ కర్రీ రెసిపీ’ పై చేసిన వీడియో జంతు హక్కుల కార్యకర్తలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. సిరిసిల్ల తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్కుమార్పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. శనివారం అప్లోడ్ చేసిన వీడియోలో.. జాతీయ పక్షిని చట్టవిరుద్ధంగా చంపడాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తూ సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి నెమలి కూరను ఎలా వండాలో అతను తెలియజేశాడు. ప్రణయ్ కుమార్‌కు చెందిన శ్రీ టీవీ ఛానెల్లో అడవి పంది కూర వండడంపై మరో వివాదాస్పద వీడియో కూడా ఉంది. ఈ వీడియోలు తొలగించబడినప్పటికీ, జంతు హక్కుల కార్యకర్తలు పోలీసులు, అటవీ అధికారులు దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
"బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతనితో పాటు అలాంటి కార్యకలాపాలకు పాల్పడే ఇతరులపై కఠిన చర్యలు తీసుకుంటాము" అని రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ‘X’ పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఫారెస్ట్స్ అండ్ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ (FAWPS) ప్రకారం, తెలంగాణకు చెందిన OneVBH Vlogs అనే మరో ఛానెల్ కూడా అటవీ జంతువులను వేటాడే వీడియోలను పదే పదే అప్లోడ్ చేస్తోంది. మేము అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని, సంబంధిత చట్టంలోని సెక్షన్ల కింద వాటిని బుక్ చేయాలని కోరామని FAWPS కు సభ్యులు తెలిపారు. గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కూడా వన్యప్రాణులకు ఆపద కలిగిస్తున్న వ్యక్తులను అటవీ శాఖ కనుగొనలేకపోతోందని ఆరోపించారు.
మే 2024లో, WCCB అక్రమ వ్యాపారం, వేటాడటం, రక్షిత జంతువుల వంటలకి సంబంధించిన 1,158 వీడియోలను తీసివేసింది. రాష్ట్రంలో ఒకప్పుడు యాక్టివ్‌గా ఉన్న వైల్డ్‌లైఫ్ యాంటీ పోచింగ్ స్క్వాడ్ ఇప్పుడు సైలెంట్ గా ఉండడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
Next Story