Mon Dec 23 2024 11:56:45 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ ను కలిసిన వైఎస్ షర్మిల
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. అరగంట సేపు గవర్నర్ తో షర్మిల భేటీ అయ్యారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. అరగంట సేపు గవర్నర్ తో షర్మిల భేటీ అయ్యారు. అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టు మెగా కృష్ణారెడ్డిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేసినట్లు షర్మిల తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మూడు సంవత్సరాల్లోనే మునిగిపోయిందన్నారు. అది అద్భుతమైన మోసమని, అద్భుతమైన అబద్ధమని షర్మిల ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.
దోచుకుంటున్నారంటూ.....
ఇక వరద బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పదివేల నష్టపరిహారం ఒక్కరికికూడా ఇవ్వలేదని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టు చెక్కు చెదరలేదని, కాళేశ్వరం మాత్రం మునిగిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంక్రీట్ తో కట్టలేదని, బ్రిక్స్ , మట్టితో కట్టారని షర్మిల ఆరోపించారు. తెలంగాణను మెగా కృష్ణారెడ్డి దోచుకుంటున్నారని తెలిపారు. ఆయన విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని షర్మిల ప్రశ్నించారు. 90 శాతం ప్రాజెక్టులు మెగా కృష్ణారెడ్డికే ఎందుకు దక్కుతున్నాయని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇక ఎవరూ ప్రాజెక్టులు నిర్మించలేరా? అని నిలదీశారు.
Next Story