Mon Dec 23 2024 07:12:17 GMT+0000 (Coordinated Universal Time)
మా నాన్నను కుట్రచేసి చంపారు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న తన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో షర్మిల మాట్లాడుతూ.. తన తండ్రి..
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న తన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో షర్మిల మాట్లాడుతూ.. తన తండ్రి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని ఆరోపించారు. తనను కూడా అలాగే చంపాలనుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. "కేసీఆర్.. నీకు దమ్ముంటే పనిమనుషుల్లా వాడుకుంటున్న నీ పోలీసులను నన్ను అరెస్ట్ చేయడానికి పంపించు" అని సవాల్ చేశారు. తాను బేడీలకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ అవినీతి, అన్యాయాలను ప్రశ్నిస్తున్న తన గొంతును నొక్కేయాలనుకోవడం మంచిది కాదన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి పై విమర్శలు చేసినందుకు తనపై కేసు పెట్టారని షర్మిల తెలిపారు. కానీ తనపై ఆయన చేసిన విమర్శల మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ తనను ప్రజల నుంచి దూరం చేయలేరన్నారు. నేను వారి అవినీతిని ప్రశ్నిస్తే తప్పు అంటున్నారు.. మరి ఒక నీతి మాలిన అవినీతి మంత్రి నన్ను మరదలు అంటే తప్పు లేనప్పుడు.. నేను ఏవడ్రా మరదలు అంటే తప్పు వచ్చిందా ? అని ప్రశ్నించారు షర్మిల.
జడ్చర్ల నియోజకవర్గంలో జరుగుతున్న వాటిపై ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేక తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఐకమత్యం.. పాలమూరు ప్రాజెక్ట్ విషయంలో ఎందుకు చూపలేదన్నారు. 8 సంవత్సరాలుగా పాలమూరు ప్రాజెక్ట్ ను పూర్తి చేయకపోతే ఐకమత్యంగా ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదా ? అన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ దక్షిణ తెలంగాణకి ఎంతో కీలకమన్న షర్మిల.. 12 లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టును జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి అటకెక్కించారని దుయ్యబట్టారు. ప్రాజెక్ట్ కోసం ఎమ్మెల్యేలు ఎప్పుడూ పోరాడలేదని, కనీసం అసెంబ్లీలో ప్రాజెక్ట్ ప్రస్తావన కూడా తీయలేదని ఎద్దేవా చేశారు.
తన పాదయాత్రతో ప్రజా సమస్యలు బయటకు వస్తున్నాయని తెలిసి, ప్రభుత్వం చేస్తున్న కుట్ర బయటపడుతుందని భయపడి తన పాదయాత్రను ఆపే కుట్ర జరుగుతోందని షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ స్కామ్, కేటీఆర్ అవినీతిపై విచారాణ చేసే దమ్ము లేదన్నారు. మరదలు మరదలు అంటూ తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని, తెలంగాణలో ఆడబిడ్డకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. దివంగత సీఎం కూతురైన నేను.. నాపై కామెంట్స్ చేసినవారిపై కేసు పెడితే ఎలాంటి రియాక్షన్ లేదు.. ఇక సామాన్యులకు జరిగే అన్యాయాలపై ఏం యాక్షన్ తీసుకుంటారని పోలీసులను ప్రశ్నించారు.
Next Story