కేసీఆర్ ఈరోజు సర్వే ఫలితాలు ఏం చెబుతాయి?
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుల సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో కేసీఆర్ మళ్లీ సర్వే ఫలితాలు వెల్లడిస్తారేమోనని ఆ పార్టీ శాసనసభ్యులు, ఎంపీలకు దడ పుడుతోంది. ఇప్పటి వరకూ మూడు సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పనితీరుపై సర్వే చేయించిన కేసీఆర్ నాలుగోసారి సర్వే చేయించారని చెబుతున్నారు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేసీఆర్ మూడో సర్వే ఎలా ఉంటుందోనన్న టెన్షన్ ఆ పార్టీ నేతల్లో నెలకొని ఉంది. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశమంటేనే సర్వేల సమావేశమన్న పేరు బలంగా ఆ పార్టీ నేతల్లో పడిపోయింది. ఇప్పుడు సర్వే ఫలితాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించనున్నారు.
అభివృద్ధి పనులపై కూడా......
ఈ సమావేశంలో మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి పనుల అభివృద్ధిని కూడా కేసీఆర్ శాసనసభ్యులకు వివరించనున్నారు. ఇంటింటికీ సురక్షిత మంచినీటిని అందించకుంటే వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని కేసీఆర్ ఇప్పటికే ప్రకటన చేయడంతో మిషన్ భగీరధ పనులను సత్వరం పూర్తి చేయాలని ఇప్పటికే కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు రెండు విడతలుగా నాలుగు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడికి డిపాజిట్ చేసే అంశం కూడా చర్చించనున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రమంతటా భూ సర్వేకు కేసీఆర్ ఆదేశించారు. వీటన్నింటిపైనా కేసీఆర్ ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలకు వివరించనున్నారు. వీటితో పాటు మూడో విడత సర్వే ఫలితాలు కూడా వెల్లడిస్తారని తెలియడంతో గులాబీ నేతలు వణికిపోతున్నారు. కేసీఆర్ ఎలాంటి క్లాస్ పీకుతారోనని భయపడిపోతున్నారు.
- Tags
- కేసీఆర్