టీడీపీ మిత్ర ద్రోహంపై కమలనాధుల మండిపాటు
కాకినాడ మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ సంకీర్ణ ధర్మాన్ని పాటించడం లేదని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో బీజేపీ-టీడీపీలు కలిసి పోటీ చేస్తున్నా దాదాపు బీజేపీకి కేటాయించిన అన్ని వార్డుల్లో టీడీపీ రెబల్స్ బరిలో నిలిచారు. దీనిని కూడా టీడీపీ సమర్ధించుకుంటోంది. బీజేపీ బలహీనమైన అభ్యర్ధుల్ని నిలిపినందుకే తమ రెబల్స్ బరిలో ఉన్నారని చెప్పుకోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా 35వ వార్డులో బీజేపీ మాజీ బ్యాంకు ఉద్యోగిని తమ అభ్యర్ధిగా రంగంలోకి దింపింది. అయితే ఇంటింటి ప్రచారంలో ఆయనకు ఓటర్లు సరిగా స్పందించడం లేదనే మిషతో టీడీపీ రెబల్కు బహిరంగంగానే ఆ పార్టీ నేతలు మద్దతిస్తున్నారు. జిల్లా టీడీపీ నేతల వ్యవహార శైలిపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలు టీడీపీ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారు. తమకు ఇచ్చిన 9 స్థానాల్లో గెలుపు దక్కనివ్వకుండా చేసేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు.
రెబల్స్ కు ఆర్థికసాయం కూడా.....
కాకినాడ కార్పొరేషన్ లో మొత్తం 48 వార్డులు జరగుతుండగా రెబల్స్ బెడద తీవ్రంగా ఉంది. అన్ని పార్టీలో ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రధానంగా టీడీపీలోనే ఇది ఎక్కువగా కన్పిస్తోంది. ముఖ్యంగా బీజేపీకి కేటాయించిన 9 వార్డుల్లో కొందరు టీడీపీ నేతలు బరిలోకి దిగారు. పార్టీ ఆదేశాల మేరకే వారు పోటీలో ఉన్నట్లు బీజేపీకి తెలిసింది. ఎందుకంటే వారికి కనీసం బుజ్జగింపు చెప్పి పక్కకు తప్పుకునేలా చేయకపోగా వారికి ఆర్థికంగా సాయం కూడా అందిస్తుందన్న సమాచారం తెలియడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.పొత్తు లేకుంటే తమకు బలమున్న స్థానాల్లో సొంతంగా పోటీ చేసుకునే వాళ్లమని., పొత్తు ప్రకటించి వెన్ను పోటు పొడుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అంత సులువుగా వదలబోమంటున్నారు.