డేరా బాబా పని ఇక అయిపోయినట్లేనా...?
డేరా బాబా పనిపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయస్థానం తీర్పును థిక్కరిస్తూ రాంరహీం బాబా అనుచరులు విధ్వంసం సృష్టించి అనేక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పుపెట్టారు. రైల్వే స్టేషన్లను తగులబెట్టారు. పోలీసుల సాక్షిగానే డేరా బాబా ఫ్యాన్స్ వీరంగం జరుగుతున్నా పట్టించుకోలేదన్న విమర్శను ప్రభుత్వం ఎదుర్కొంది. పంచకులను తగుల బెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, రాజకీయ ప్రయోజనాలకు ప్రభుత్వం తలొగ్గిందని హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. వేలాది కోట్ల ఆస్తులున్న బాబాను కట్టడి చేయాలని నిర్ణయించిన సర్కార్ అందుకు చర్యలను వెంటనే ప్రారంభించింది. శనివారం కురుక్షేత్రలోని డేరా బాబాకు చెందిన ఆశ్రమాలను రెండింటిని హర్యానా అధికారులు క్లోజ్ చేశారు. ఆశ్రమంలో ఉన్నవారిని బయటకు పంపి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆశ్రమాలు రెండింటికీ తాళాలు వేశారు.
జైలులో సకల సౌకర్యాలు......
పంజాబ్, హర్యానాలలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించినా ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అల్లర్ల కారణంగా రోడ్డు, రైలు మార్గాల ప్రయాణం దాదాపు నిలిచిపోయింది. అయితే రోహ్ తక్ జైలును తరలించిన బాబాకు ఆ జైలులో రాచమర్యాదలు అందుతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. జైలులో బాబాకు వ్యక్తిగత సహాయకుడిని కూడా నియమించారన్న విమర్శలు విన్పించాయి. అయితే ఈ విషయాన్ని జైలు అధికారులు ఖండిస్తున్నారు. బాబా సాధారణ ఖైదీ మాదిరిగానే జైలులో ఉన్నారంటున్నారు. మరోవైపు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జైలు నుంచి కోర్టు విచారించనుంది. తీర్పు చెప్పిన జడ్జి జగదీప్ సింగ్ కు ప్రభుత్వం భారీ భద్రతను పెంచింది. ఆయన ప్రాణానికి హాని ఉందన్న సమాచారంతో జగదీప్ సింగ్ ఇంటివద్ద పెద్దయెత్తున పోలీసులను హర్యనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- Tags
- డేరా బాబా