తలైవి విషయంలో పశ్చాత్తాప పడిన తలైవా
పురట్చితలైవి జయలలిత కన్నమూసినప్పుడు... పార్థివ దేహానికి నివాళి అర్పించి.. అక్కడికక్కడ ఉద్వేగాన్ని ఆపుకోలేక కళ్లమ్మట నీళ్లు పెట్టుకుని విలపించిన వారిలో.. తలైవా రజనీకాంత్ కూడా ఉన్నారు. అయితే ఒకప్పట్లో జయలలిత తో ఢీ కొట్టిన రజనీకాంత్ వైఖరిలో ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. ఒకప్పట్లో జయలలిత పట్ల శత్రు వైఖరిని కలిగి ఉన్నందుకు రజనీకాంత్ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు.తాజాగా నడిగర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సంతాప సభలో సూపర్ స్టార్ రజనీకాంత్ తన మనసులో మారిన భావాలను స్పష్టంగా బయటపెట్టుకునే ప్రయత్నం చేశారు.
రజనీకాంత్ ఒకప్పట్లో జయలలిత కు బద్ధశత్రువుగా వ్యవహరించిన సంగతి తమిళ రాజకీయాలతో పరిచయం ఉన్న వారికి ఖచ్చితంగా గుర్తుంటుంది. జయలలిత, తాను అధికారంలో ఉండగా రజనీకాంత్ ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిందని , పర్యవసానంగా వారి మధ్య ఓ రిఫ్ట్ ఏర్పడిందనే ప్రచారం సాగింది. జయలలిత కరిష్మాకు చెక్ పెట్టడానికే తలైవా రజనీకాంత్.. రాజకీయ రంగం ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు ఎన్ని సంవత్సరాలు తమిళసీమలో షికారు చేశాయో లెక్కేలేదు. రజనీ రాజకీయ రంగ ప్రవేశం అంటూ జరిగితే అది కేవలం జయలలిత మీద కక్ష సాధించడానికే అనే ప్రచారం కూడా ఉండేది.
అయితే పురట్చితలైవి జయలలిత మరణంతోనే... తలైవాలోని పంతం కూడా కొడిగట్టిపోయినట్లుంది. ఆయన ఇప్పుడు తీవ్రమైన పశ్చాత్తాపంలో ఉన్నారు. ఒక సమయంలో ఎన్నికల్లో జయలలిత పరాజయానికి పరోక్షకారణం తాను అయినందుకు పశ్చాత్తాపపడుతున్నట్లు తలైవా రజనీకాంత్ అన్నారు. జయలలిత తనకున్న అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకున్నారు. జయలలిత చాలా ఎదురుదెబ్బలు తింటూ ఎదిగివచ్చారని, తన జీవితంలో చివరిక్షణం వరకు ప్రజల కోసమే జీవించారని రజనీకాంత్ పేర్కొనడం విశేషం.
ఏంటి సంకేతం?
రజనీకాంత్ జయలలితకు నివాళి అర్పించడమూ, మరణం పట్ల ఆవేదన చెందమూ అంతా ఒక ఎత్తు.. అయితే.. ఒకప్పుడు ఆమెతో విభేదించి ఆమె ఎన్నికల ఓటమికి తాను కారణం అయినందుకు పశ్చాత్తాపడడం మరో ఎత్తు. అయితే తలైవా పశ్చాత్తాపం తమిళ రాజకీయాల మీద కూడా ప్రభావం చూపిస్తుందా? రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? అనేది కొత్తగా మొదలవుతున్న సస్పెన్స్.