నంద్యాలలో గ్రామాలే జగన్ ను రక్షిస్తాయా?
నంద్యాలలో ఓటర్లు క్యూ కట్టారు. ఎన్నడూ లేని విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవుతోంది. అయితే ఇది వైసీపీ నేతల్లో సంతోషాన్ని నింపుతుంది. వైసీపీకి గ్రామాల్లో పట్టు ఎక్కువ. ముఖ్యంగా గత ఎన్నికల ఫలితాలను పరిశీలించినా అప్పటి వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి గోస్పాడు, నంద్యాల రూరల్ మండలాల్లో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఓట్లతోనే విజయం సాధించారు. అయితే ఈరోజు పోలింగ్ సరళిని చూస్తే గ్రామాల్లో ఎక్కువ శాతం ఓట్లు నమోదయ్యాయి. వికలాంగులు, వృద్ధులు, మహిళలు, బాలింతలు....ఇలా ఒకరేమిటి గ్రామాలలో పెద్దయెత్తున ఓటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం తమకు శుభ సంకేతమేనంటోంది వైసీపీ. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఎప్పుడో చీలిపోయి ఉంటారు. తటస్థ ఓటర్లు ఉండటం చాలా అరుదు. అందుకోసమే గ్రామాల్లో ఎన్ని ఓట్లు ఎక్కువ పోలయితే అంత మంచిదని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. నంద్యాల ఉప ఎన్నికలో ఎక్కువగా గ్రామాల్లోనే అధిక శాతం ఓట్లు పోలవ్వడం వైసీపీ నేతల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.
పల్లెల్లో పోటెత్తిన ఓటర్లు....
నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల రూరల్, గోస్పాడు మండలాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం వందకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలన్నీ ఉదయం నుంచే కిక్కిరిసి పోయి ఉన్నాయి. నంద్యాల రూరల్ లో దాదాపు 90 శాతం ఓట్లు పోలవ్వగా, గోస్పాడు మండలంలో 92 శాతం ఓట్లు నమోదయినట్లు తెలుస్తోంది. ఇందులో మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. గోస్పాడు మండలం, నంద్యాల రూరల్ మండలంలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడంతో వైసీపీ నేతలు విజయం తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. నంద్యాల పట్టణంలో మాత్రం 70 శాతం వరకూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం మీద పోలింగ్ శాతం గ్రామీణ ప్రాంతంలో పెరగడంతో వైసీపీకి విజయం పై ఆశలు చిగురించాయి.
- Tags
- నంద్యాలలో వైసీపీ