నంద్యాలలో విజేత ఎవరో?
నంద్యాలో నేత ఎవరో నేడు తేలనుంది. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కౌంటింగ్ నంద్యాలలోని పాలిటెక్కిక్ కళశాలలో జరగనుంది. ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో విజేత ఎవరో నేడు తేలిపోనుంది. పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటంతో రెండు పార్టీల్లో ధీమా పెరిగింది. ఎవరికి వారే గెలుపు తమదేనంటున్నారు. దీంతో నంద్యాలలో ఏ పార్టీ జెండా ఎగురుతుందన్న టెన్షన్ సర్వత్రా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ పాస్ లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని, ఇతరులను లోపలికి రానివ్వబోమని అధికారులు ప్రకటించారు.
మూడంచెల భద్రత మధ్య.......
కౌంటింగ్ కేంద్రానికి పోలీసులు మూడంచెల భద్రత కల్పించారు. నంద్యాల మొత్తం నేడు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. గుంపులు గుంపులుగా జనం చేరడానికి అంగీకరించరు. ప్రశాంత వాతావరణానికి విఘాతం కల్గిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. కౌంటింగ్ కోసం ఒక అదనపు ఎస్పీతో పాటు ఐదుగురు డీఎస్పీలు, 17మంది సీఐలు, 38 మంది ఎస్సైలు 74 మంది ఏఎస్సైలు, 260 మంది కానిస్టేబుళ్లను, పది ప్రత్యేక బృందాలను నియమించారు. ఐదు ప్లాటూన్ల ఏపీఎస్పీ పోలీసులు కూడా విధుల్లో ఉన్నారు. మొత్తం 255 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నిక తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. 9.30 కల్లా నంద్యాలలో ఎవరు విజేతో తెలిసే అవకాశముంది. ప్రతి ఓటూ కీలకం కావడంతో కౌంటింగ్ ప్రక్రియలో కొన్ని అభ్యంతరాలు ఎవరు లేవనెత్తినా పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద నంద్యాల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.
- Tags
- నంద్యాల కౌంటింగ్