నంద్యాలలో విపరీతమైన ఖర్చుకు పెద్దనోట్ల రద్దే కారణమా?
పెద్దనోట్ల రద్దు తర్వాత తొలిసారి జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో ఆ ఎఫెక్ట్ పడిందంటున్నాయి రాజకీయ పార్టీలు. నంద్యాల ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రచారాన్ని దాదాపు నెలరోజుల పాటు ముమ్మరంగా నిర్వహించారు. విపరీతంగా డబ్బులు కూడా వెదజల్లారన్న ఆరోపణలూ ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నికను అతి ఖరీదైన ఎన్నికగా పేర్కొన్నారు. రెండు పార్టీలు కలిపి దాదాపు రెండు వందల కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అయితే పెద్దనోట్ల రద్దు వల్లనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు రాజకీయ పార్టీ నేతలు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నిక ఖర్చు రెట్టింపయిందంటున్నారు నంద్యాల లోకల్ లీడర్లు. గత ఎన్నికల్లో ఓటుకు వెయ్యి రూపాయలు మాత్రమే పంచిపెట్టారు. ఈ ఎన్నికలకు అది రెట్టింపయిందంటున్నారు.
వెయ్యి నోటు లేనందునే.....
అందుకు ప్రధాన కారణం వెయ్యి నోటు రద్దేనన్నది రాజకీయ నేతల విశ్లేషణ. రెండు వేల రూపాయలు, ఐదొందలనోటు మాత్రమే చెల్లుబాటులో ప్రస్తుతం ఉన్నాయి. ఐదొందల నోటు ఇస్తే ముఖంమీద కొట్టేస్తారు ఓటరు. అంతేకాకుండా రూ500 నోట్ల కొరత తీవ్రంగా ఉంది. పార్టీ నేతలు అందరూ రెండు వేల నోట్ల రూపాయలనే ఎన్నికల వ్యయం కోసం తెచ్చుకుని ఉంచుకున్నారు. దీంతో ఓటరుకు రెండు వేలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. గత ఎన్నికల్లో వెయ్యినోటు చెలామణిలో ఉండటంతో పెద్దగా ఖర్చు కాలేదు. ఓటర్లకు మూడో కంటికి కూడా తెలియకుండా డబ్బులివ్వాల్సి రావడంతో రెండు వేల నోటును తీయక తప్పలేదంటున్నారు. అందుకే ఎన్నికల వ్యయం రెట్టింపయిందన్న విశ్లేషణలు పొలిటికల్ పార్టీలో జోరుగా విన్పిస్తున్నాయి.