నంద్యాల ఫలితం కాకినాడలో రిపీట్ అవుతుందా?
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది. టీడీపీ విజయఢంకా మోగించింది. ఇక నేడు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమవుతోంది. ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 48 డివిజన్లకు నేడు పోలింగ్ జరగనుంది. 48 డివిజన్లలో 39 స్థానాల్లో టీడీపీ, 9 స్థానాల్లో బీజేపీ పోటీచేస్తోంది. బీజేపీ, టీడీపీలు పొత్తుతో ఈ ఎన్నికలకు వెళ్తున్నాయి. మరోవైపు వైసీపీ 48 డివిజన్లలో పోటీ చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు కాకినాడలోనే మకాం వేసి ప్రచారాన్ని నిర్వహించారు. చంద్రబాబు కూడా రెండు రోజుల పాటు కాకినాడలో ప్రచారం చేశారు. వైసీపీ అధినేత జగన్ ఒకరోజు కాకినాడకు వచ్చి రోడ్ షోలు నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ కూడా బరిలో ఉంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా కాకినాడలో ప్రచారం చేశారు.
నేడు కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్......
కాకినాడ ఎన్నికను కూడా రెండు ప్రధాన పార్టీలూ ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం తర్వాత కాకినాడ మీద టీడీపీకి ధీమా మరింత పెరిగింది. ప్రజలు అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారని టీడీపీ అంటోంది. అయితే నంద్యాల పరిస్థితి వేరని, అక్కడ సానుభూతి వల్లనే టీడీపీ గెలిచిందని, కాకినాడలో ఆ పరస్థితి లేదంటోంది వైసీపీ. కాకినాడలో అత్యధిక డివిజన్లను తామే కైవసం చేసుకుంటానంటోంది. అయితే రెండు పార్టీలకూ రెబల్స్ బెడద ఉండటంతో ప్రజలు ఏ పార్టీకి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది. ఈ నెల 1వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలీసులు పోలింగ్ కోసం విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.