నేను ప్రతిపక్షం కాదంటున్న రేవంత్
ఏమిటీ ట్విస్టు అనుకుంటున్నారా? తెలంగాణలో తనను ప్రతిపక్షంగా భావించవద్దంటూ కేసీఆర్ ను ఉద్దేశించి చెప్పే పరిస్థితి రేవంత్ కు వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారా? తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలసి పనిచేయడానికి సిద్ధం అని చంద్రబాబునాయుడు ప్రకటించినంత మాత్రాన రేవంత్ వైఖరిలో కూడా.. మార్పు వచ్చేసిందేమో అనుకుంటున్నారా? నిజానికి అంత సీన్లేదు. కాకపోతే.. రైతుల సమస్యల గురించి ముఖ్యమంత్రికి ఓ బహిరంగ లేఖ రాసి.. అందులోని అంశాలను ఏదో ప్రతిపక్ష నేత చెప్పిన అంశాలుగా భావించి తోసిపుచ్చవద్దంటూ ఓ విజ్ఞప్తి కూడా చేసేశారు.
టీ సర్కారు మీద తెలుగుదేశం పార్టీ తరఫున అలుపు లేని పోరాటం సాగిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులన్నిటినీ ఒకే విడతగా బ్యాంకు అకౌంట్లలో వేయించాలని రేవంత్ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.6లక్షల పరిహారం, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 40 వేల వంతున పరిహారం చెల్లించాలంటూ ఇంకా రైతు సంబంధిత డిమాండ్లు అనేకం రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
రేవంత్ రెడ్డి ఒకవైపు ముమ్మరంగా విద్యార్థి పోరుబాటలో ఉద్యమిస్తున్నారు. తాజాగా మళ్లీ రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలు అన్నిటిమీద కేసీఆర్ కు ఈ బహిరంగ లేఖ రాశారు. అంతిమంగా.. మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ ఏయే ప్రజల అంశాల మీద ఫోకస్ పెట్టబోతున్నదో రేవంత్ సంకేతాలు ఇస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా రైతు, విద్యార్థి సమస్యల మీదనే ప్రధానంగా అసెంబ్లీని స్తంభింపజేయాలనే ఉద్దేశంతో ఉన్నది. కాకపోతే.. వారు నోట్లరద్దు, మరియు డిజిటల్ తెలంగాణకు జై కొడుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారనే అంశాన్ని కూడా లేవనెత్తబోతున్నారు. నోట్లరద్దును వ్యతిరేకించే అవకాశం, వెసులుబాటు తమకెటూ లేదు గనుక, ఆ రకంగా ఎదురవుతున్న ప్రజల ఇబ్బందులపై తాము నోరు మెదపలేం గనుక.. రేవంత్ రెడ్డి ప్రభృతులు ఈ రెండు అంశాలకు పరిమితం అవుతున్నట్లుగా కనిపిస్తోంది.