పక్కా వ్యూహంతోనే ముందడుగేసిన ముద్రగడ
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ గుర్తు చేస్తూ గత నెల 26 న పాదయాత్రకు సంకల్పించారు . ఆ రోజు నుంచి ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదంటూ ఇంటి గేటు ముందే పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు . మొదట్లో పది రోజుల గృహ నిర్బంధం నోటీస్ ఇచ్చిన ఖాకీలు ఆ తరువాత ఏ రోజుకారోజు ఆయన్ను నిరోధించారు . మధ్యలో పాదయాత్రకు తప్ప ఎక్కడికైనా వెళ్లొచ్చు అంటూ కలెక్టర్ ఉత్తర్వులు చూపించారు . దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇస్తే అప్పుడే యాత్ర ప్రారంభం అవుతుందని రోజు గేటు దాకా వెళ్ళి పోలీసులతో వాగ్వాదానికి దిగి వెనక్కి వచ్చేవారు . ఆ తరువాత ఆయనకు వివిధ జిల్లాల నుంచి వస్తున్న సందర్శకులు పెరిగిపోవడంతో గేటు లోపల టెంట్ వేసుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరసన తెలుపుతూ వచ్చారు. మధ్య మధ్యలో ప్రెస్ మీట్స్ పెడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ వచ్చారు . ఒక దశలో తనలో సహనం నశిస్తుందని గోడ దూకి పాదయాత్రకు పారిపోవాలనిపిస్తుందన్నారు . దీనిపై హోమ్ మంత్రి ఆయన్ను గోడ దూక నీయబోమంటూ వార్నింగ్ ఇచ్చారు . ఇది కాపుల్లో మరింత ఆగ్రహాన్ని కలిగించి కిర్లంపూడి కి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చేలా చేసింది .
పోలీసులకు షాక్ ఇచ్చిన ముద్రగడ ....
ముద్రగడ ఆంక్షలు ఉల్లఘించరనే పోలీసులు భావించి భద్రత తగ్గించారు . దీనికి తోడు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చివరి రోజు ప్రచార ఘట్టానికి ముఖ్యమంత్రి చంద్రబాబు , విపక్ష నేత జగన్ ఒకే రోజు పర్యటించడంతో అందరి అటెన్షన్ అటు మళ్ళింది . వినాయక చవితి పండగ చేసుకోమని తనకు ఎలాగూ పండగ లేదంటూ పోలీసులకు చెప్పిన ముద్రగడ ఆకస్మికంగా ఆదివారం పాదయాత్ర చేపడతారని ఎవ్వరు ఊహించలేదు . ముందుగా ప్రెస్ మీట్ పెట్టి సర్కార్ తీరును దుయ్యబట్టిన ఆయన వేలమంది కాపులతో ఒక్కసారిగా పోలీస్ బారికేడ్లను భద్రతా సిబ్బందిని దాటుకుని పాదయాత్ర కు బయల్దేరారు . ఇది అందరిని షాక్ కి గురిచేసింది .వెంటనే తేరుకుని అదనపు బలగాలను రప్పించుకునే సమయానికి ఆయన దాదాపు మూడు కిలోమీటర్లు ముందుకు సాగారు . చివరికి రాజు పాలెం , వీరవరం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేసి అజ్ఞాత ప్రాంతానికి ఆయన్ను తరలించారు . ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి పోలీసులకు తలప్రాణం తోకకు వచ్చింది . ఒక పక్క ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా అధికార పార్టీకి ముప్పు తప్పదు . దాంతో బలప్రయోగం చేయకుండా పోలీసులు ఎంతో సంయమనంతో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు . ఇదంతా రాజమండ్రి లో మకాం వేసి మరీ డిజిపి సాంబశివరావు పర్యవేక్షించడం విశేషం .
- Tags
- ముద్రగడ