మహిళలకు రిజర్వేషన్లతో పదవి కోల్పోయిన సిఎం...
మహిళలకు కోటా కల్పించే విషయంలో తలెత్తిన వివాదం నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ పదవికి ఎసరు తెచ్చింది. గిరిజన తెగల ఆందోళనలతో ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు కోటా వివాదం నాగాలాండ్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైంది. మహిళల కోటా రిజర్వేషన్‌పై కొద్దిరోజుల కిందట ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఇందులో ఇద్దరు గిరిజనులు మృతిచెందారు. అప్పటి నుంచి నిరసనకారులు మరింత తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం లోగా ముఖ్యమంత్రి జెలియాంగ్ గద్దె దిగాలని నిరసనకారులు అల్టిమేటం జారీ చేశారు. దీనికి తోడు నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు కూడా జెలియాంగ్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కేటాయించాలన్న సీఎం జెలియాంగ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగాలాండ్ గిరిజన యాక్షన్ కమిటీ ఆందోళనకు దిగింది. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం తమ సంప్రదాయానికి విరుద్ధమంటూ గిరిజన గ్రూపులు ఆందోళనకు దిగడంతో నాగాలాండ్ గతకొన్నిరోజులుగా రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు కూడా గిరిజన గ్రూపులకు మద్దతు పలుకడంతో టీఆర్ జెలియాంగ్ సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎదురుతిరగడంతో నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన గిరిజన గ్రూపులకు మద్దతుగా ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు సీఎం జెలియాంగ్కు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు జెలియాంగ్ ప్రకటించారు. నాగాలాండ్‌లో ఎన్పీఎఫ్ నేతృత్వంలోని నాగాలాండ్ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇందులో 46మంది ఎన్పీఎఫ్, నలుగురు భాజపా, 8మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో జేడీయూ, ఎన్సీపీలకు చెరో సభ్యుడు ఉన్నారు. నాగాలాండ్ ప్రజాస్వామ్య కూటమి రేపు సమావేశమై కొత్త సీఎంను ఎన్నుకోనుంది.సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఎన్పీఎఫ్ పార్టీ శాసనసభ్యుల సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారని తెలిపారు.నాగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిగా కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో ఎన్పీఎఫ్ సభ్యులంతా పాల్గొనాలని జెలియాంగ్ విజ్ఞప్తి చేశారు.