రైల్వే మంత్రిగా గడ్కరీ.....?
రైల్వే మంత్రి రాజీనామాను ప్రధాని మోదీ అమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సురేష్ ప్రభు స్థానంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రైల్వే శాఖ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర క్యాబినెట్ భేటీ తర్వాత ఈ విషయంపై ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. సురేష్ ప్రభు అభ్యర్ధన విషయంలో ప్రధాని సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం మంచి పద్ధతని., ఐదు రోజుల వ్యవధిలో జరిగిన రెండు రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తానని సురేష్ ప్రభు కోరడం., వేచి చూడాలని ప్రధాని చెప్పిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బుధవారం ఉదయం ప్రధానితో భేటీ అయిన సురేష్ ప్రభు రాజీనామాకు సిద్ధపడ్డారు. రైల్వే బోర్డు ఛైర్మన్ పదవికి ఏకె.మిట్టల్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలో సురేష్ ప్రభు ఈ వ్యాఖ్యలు ట్వీట్ చేశారు. యూపీ నుంచి ఢిల్లీ వెళుతోన్న కైఫియత్ రైలు ప్రమాదానికి గురి కావడంపై సురేష్ ప్రభు మనస్తాపానికి గురయ్యారు. రైల్వే బోర్డు ఛైర్మన్ పదవి నుంచి అశోక్ మిట్టల్ రాజీనామాను వెంటనే అమోదించిన ప్రభుత్వం ఆ స్థానంలో ఎయిరిండియా సిఎండీ అశ్వని లోహానిని నియమించింది. కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సురేష్ ప్రభు రాజీనామాకు అమోదం తెలిపినా మరో శాఖను కేటాయించే అవకాశాలు లేకపోలేదు.