శిల్పా, భూమా ఇంత పిసినారులా?
నంద్యాల అభ్యర్థులు ఎంత పిసినారులో తెలుసా? రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులూ అంతేనండి. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఈ నెల 21వ తేదీన అభ్యర్థులందరూ తమ ప్రచార ఖర్చును ఎన్నికల కమిషన్ కు నివేదించారు. వీటిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఎవరికీ ప్రచార ఖర్చులు పది లక్షలకు మించలేదు. అందులో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థులు ప్రచార ఖర్చు కూడా చాలా తక్కువగానే చేశారు. ఒకవైపు అధికార పార్టీలో మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనలు చేశారు. మరోవైపు ప్రతిపక్షనేత జగన్ తోపాటు ఎమ్మెల్యేలు, సీనియర్ మంత్రులు, ప్రచారంలో పాల్గొన్నారు. అయినా వీరి ఖర్చు మాత్రం చాలా తక్కువే. అందుకే వీరు పొదుపరులను కోవాలా? లేక దొంగ లెక్కలు అనుకోవాలా? రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న నంద్యాల ఉప ఎన్నిక కోసం రెండు ప్రధాన పార్టీలూ రెండు వందల కోట్లకు పైగానే ఖర్చు చేశాయని వార్తలు వస్తున్నాయి. రోజుకు రెండు కోట్లు ఒక్క ప్రచారానికే ఖర్చు పెట్టారని కూడా చెబుతున్నారు. కాని ఎన్నికల కమిషన్ కు మాత్రం లెక్కలతో తప్పుదోవ పట్టించారు.
టీడీపీ కంటే కాంగ్రెస్ ఖర్చే ఎక్కువా?
నంద్యాల ఉప ఎన్నికలో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ప్రచారం ముగియడంతో ఆ ఖర్చును అభ్యర్థులు ఎన్నికల అధికారులకు చెప్పాల్సి ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక్కొక్క అభ్యర్థి 28 లక్షల వరకూ ఖర్చు చేసే వీలుంది. కాని అందులో సగం కూడా ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖర్చు చేయలేదట. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి 6.49 లక్షలు, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి 10,35,356 లక్షలు ఖర్చు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ 6,60,223 లక్షలు ఖర్చు చేశారు. అంటే టీడీపీ అభ్యర్థి కంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థే ఎక్కువ ఖర్చు చేశారన్నమాట. ఇలా ఉన్నాయి నంద్యాల లెక్కలు మరి.