Sat Nov 23 2024 04:49:40 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మ - ఆవకాయ
in summer avakaya pickle in olden days
బడినుంచి ఇంటికిరాగానే అమ్మని వెతుక్కున్నట్టు అన్నాలకి కూర్చోగానే ఆవకాయ జాడీ ఎక్కడుందో వెతుకుతాయి కళ్లు. వేడివేడిగా కలగూరపప్పు, మువ్వొంకాయ కూర, ముక్కలపులుసూ ఉన్నాసరే, ఆవకాయ కనబడకపోతే ఇళయరాజా పాటలో ఫ్లూటెక్కడా వినబడనట్టు లోటుగా అనిపిస్తుంది. ఈలోగా అలా ఓమూల ఆలయప్రాంగణంలో పూలచెట్టులా నేనున్నానంటూ ధీమాగా పలకరిస్తుంది పింగాణీ పిల్ల. అసలీ ఆవకాయ జాడీలతో మనకు బోల్డన్ని జ్ఞాపకాలు.
మా చిన్నతనంలో వంటింట్లో నీలంరంగు చెక్కతలుపుల బీరువా తెరవగానే పదునెక్కిన పాతవాసన వచ్చేది. అదో రకమైన ఘాటు. తలుపులు మూసేసి మళ్లీ వెంటనే తెరవాలనిపించేంత వ్యసనం. తీరా తెరిచిచూస్తే మూతికి గుడ్డ బిగించి కట్టిన పొడవాటి జాడీ ఒకటి అలా నిలువుగా మా పెదనాన్నలా గంభీరంగా కనబడేది... కిందంతా పట్టుపంచెలా తెల్లగానూ, పైనేదో లేతపసుపు ఉత్తరీయం కప్పుకున్నట్టుగానూ!
ఆ జాడీని ఏ పదిరోజులకోసారో చూసేవాళ్లం. దాన్ని పెద్దావకాయ అనేవారు అమ్మానాన్నా! గుండ్రంగా, గునగునలాడుతూ మా పెద్దత్తయ్యలా కనబడే చిన్నజాడీ ఒకదాన్ని ఎప్పుడూ అన్నాల దగ్గర పెట్టేది అమ్మ. ఎందుకంటే పెద్దావకాయ తియ్యడానికి మడీ తడీ అంటూ చాలా హడావిడుంటుంది.
ఎవరితోనూ మాటాడకుండా అత్యంత శ్రద్ధతోనూ, ఇంకా బోలెడంత శుభ్రతతోనూ స్టీలు గరిటొకటి పట్టుకుని అమ్మ బయల్దేరిందంటే మా ఇలవేల్పు సినిమాలో కె.ఆర్. విజయని చూసినంత భయభక్తులతో చూసేవాళ్లం.
అలా తిన్నగా వంటింట్లోకెళ్లి కిడ్నాప్ చేసిన హీరోయిన్ నోట్లోంచి గుడ్డలు తీసినట్టు వాసినిగుడ్డ విప్పేది. ఆనక పెద్దజాడీలోంచి చిన్నజాడీలోకి దఫదఫాలుగా ఆరేడు గరిటెల ఆవకాయ నింపుతుండేది. గరిటె బయటపడిన ప్రతిసారీ కమ్మని నూనెవాసన, కళ్లనీళ్లొలికించే ఆవఘాటూ తగిలేవి. ఇక వెల్లుల్లావకాయైతే మధ్యమధ్యలో ఒక్కొక్కటి కనబడి ‘ఏరా, బావున్నావా?’ అని మమ్మల్ని పలకరించుకుంటూ జాడీలోకి జారుకునేవి.
ఇదంతా చూస్తూ ఎదిగాం. అసలు ఈ ఆవకాయల కోసం పెళ్లివారిలా నెలముందునుంచీ హడావుడి చేసేవారు నాన్నగారు. బారామాసి కాయలైతే ఊట బావుంటుందని, ఏడాదంతా పాడవదని అవే తెచ్చేవారు. పోనీ ఇప్పట్లా ఆ కాయలవాడి పక్కనే గోనెపట్టా వేసుక్కూర్చుని ముక్కలు కొట్టే అబ్బాయి చేత కొట్టించేవారా? ఎబ్బే! అలాచేస్తే సంతృప్తుండదుట.
మాయింట్లోది కాకుండా పక్కింట్లోంచి మరో కత్తిపీటో, మర కత్తిపీటో తెచ్చేవారు. అదేంటో పక్కవాళ్ళ కత్తిపీటలే బావుండేవి ఎప్పుడూ! వాటితో ఈయన మొత్తం కాయలన్నిటినీ అరగంటలో తరిగేసేవారు. అప్పుడు పిల్లలం ఐదుగురం శుభ్రంగా ఉతికిన తెల్లటి గుడ్డలొక ఐదు తీసుకొచ్చి ముక్కల బేసిన్ చుట్టూ కూర్చునేవాళ్లం. స్నానం చేయించాక చంటిపిల్లల్ని తువ్వాలుతో తుడిచినట్టు తడిలేకుండా ముక్కలన్నిటినీ తుడిచి ఇచ్చేసేవాళ్లం. జీడిమీద ఉండే పల్చటి పొరల్ని చాకుతోనో, చెంచాతోనో తియ్యడమంటే నాకు భలే సరదాగా ఉండేది.
ఈలోగా అమ్మానాన్నా కారాలూ మిరియాలూ... సారీ, కారాలు, ఉప్పూ కలిపిన ఆవపిండితో సిద్ధంగా ఉండేవారు. ఏళ్లతరబడి అందరి నోళ్లలోనూ నానుతున్న అంబటి సుబ్బన్న నువ్వులనూనె ఓపక్కగా కేజీ సైజు హార్లిక్స్ సీసాలోంచి బంగారంలా మెరిసిపోతూ ఎప్పుడెప్పుడు శివుడి జటాజూటంలోంచి కిందకి దూకుదామా అని ఎదురుచూసే గంగలా ఉండేది. ఆవకాయలో ఒలకగానే ఆత్మానందం దానికి. ఇక ఏడాదంతా ముక్కల్నీ, పిండినీ, మనల్నీ సంతోషంగా ఉంచాల్సిన బాధ్యతంతా తనదే కదా! అక్కణ్ణుంచి ఆ నూనె తాలూకా కమ్మదనం కాస్తా అమ్మదనంలా మారిపోతుంది.
అబ్బ, ఆవకాయకి ఇంత వర్ణన అవసరమా అని అడుగుతారేమో? అవసరం కాదు. విధాయకం. మా మూడో మేనత్త తన ఏడుగురు కొడుకులకీ పొద్దున్నే ఇంత ఆవకాయేసి గిన్నెడు చద్దన్నం తినిపించేసి బయటికి తోసేసేది. అదే బ్రేక్ఫాస్ట్. వీధిలో పిల్లలతో ఆడినంతసేపు ఉత్సాహంగా ఉంటారని, దాని ఉపయోగాలు, పోషకవిలువల గురించి పాఠం చెబుతూండేది. లేకపోతే అంతమందికీ ఇడ్డెన్లూ, దోశలంటూ కూర్చుంటే బట్టలుతకడాలు, అంట్లపనీ, వంటపనీ అయ్యేనా?
ఇక పెసరావకాయ, మెంతావకాయ, పులిహోరావకాయ అంటూ రకరకాలుగా దశాలంకరణలు చేసినా మెగాస్టార్ మాత్రం ఒరిజినల్ ఆవకాయే! చిన్నతనంలో మనం ఉండే మధ్యతరగతి ఇళ్లలో పెళ్లిమాటలైనా, రహస్యాలైనా అన్నీ పిల్లల ఎదురుగానే నడుస్తూ ఉండేవి. అలానే ఊరగాయలు, ఉపవాసాలూ కూడా మనకు ఎలా, ఎప్పుడు, ఎందుకు అనేది బాల్యంనుంచీ తెలుస్తూనే ఉండేవి. ఈ విజ్ఞానానికి అదే కారణం. చదువులదేం ఉంది, తిన్నగా బడికెళితే వంటపడుతుంది. కానీ ఇలా కారాలు, మమకారాలు తెలియాలంటే మాత్రం జీవితాన్ని చదవాలి.
అదృష్టవశాత్తూ తనుకూడా నాలాగే అటువంటి ఒళ్లోనే పెరిగి, అలాంటి బళ్లోనే చదివొచ్చిన ఇల్లాలు. ఇన్నేళ్ల కాపురంలో నేను కోసే కోతల గురించి (నే చెప్పేది మావిడికాయ గురించి) బానే తెలుసుకుంది.అందుకే ఈ ఆవకాయల సీజన్లో ఎప్పుడైనా అలా నోట్లో పెన్నో, కలర్నోట్లో వేలో పెట్టుకుని ఆలోచిస్తుండగా తనొచ్చి పిలుస్తుంది.
‘ఆల్చిప్పల్లాంటి కళ్లతో...’ అని ఓ రెండు లైన్లు రాయగానే రెండు ఆల్చిప్పలు నాముందు పడేసి మాగాయకి తొక్కు తియ్యమంటుంది. నేనేమో వినయవిధేయరాముళ్లా కూర్చుని చెప్పిన పనల్లా చేస్తోంటే తను టీవీనైన్ వాళ్లలా స్టింగ్ ఆపరేషనొకటి నిర్వహిస్తూ ఫొటోలు, వీడియోలు తీసేసి, వాటన్నిటినీ ‘అరాచక కుటుంబ సమూహం’ అనే వాట్సప్ గ్రూపులో పెట్టేస్తుంది.
‘ఓమూల అమ్మాయి ఉద్యోగం చేస్తోందికదా, ఇంకా ఈ చాదస్తాలేవిఁటి డాక్టర్ గారూ, కాస్త కాస్త ఏ ప్రియా పచ్చళ్లో కొనితెచ్చేసుకుని నాలిక్కి రాసుకోకా?’ అని మీరడగొచ్చు. తనకి నచ్చవు. ఇవేకాదు. దీపావళికి మతాబాలూ అంతే. కూర్చుని కూరతాం ఇప్పటికీ. అది నా సంతోషం.
ఈ ఆవకాయనేది ఒక్కోసారి ఒక్కో రుచితో మనల్ని అలరిస్తుంది. చద్దన్నంతో తింటోంటే పల్లెటూళ్లో పొలంగట్టుమీద కూర్చున్నట్టనిపిస్తుంది. వేడివేడన్నంలో వెల్లుల్లావకాయ కలిపి తింటోంటే వెంకటేశ్వరస్వామి ఎదురుగా కూర్చున్నట్టనిపిస్తుంది. ఆ క్షణం ఎన్ని జన్మలైనా మనిషిగానే, అదికూడా తెలుగువాడిగానే పుట్టించమని ఆయన్ని వేడుకోవాలనిపిస్తుంది.
ఆవకాయ కలిపిన రోజున ఇంకా ఆ ఘాటదీ పూర్తిగా దిగకముందే ఓ నాలుగుముద్దలన్నం కలుపుకుని తినిచూడండి. కొత్తపుస్తకం అట్టవాసనలా మర్చిపోలేని మధురానుభూతి కలుగుతుంది. చిరుచేదుతో ఆవపిండి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. మర్నాటికల్లా అది తన ఉనికిని మర్చిపోయి మావిడికాయతో తల్లీబిడ్డా న్యాయంగా కలిసిపోతుంది.
ఎంత సంపాదించినా చివరిదశకి కొంత మిగుల్చుకోవాలని చిన్నప్పటి నుంచీ పొదుపూ అదుపూ నేర్పారు మనందరికీ. మనమంతా ఏం మిగుల్చుకోకపోయినా ఆవకాయన్నం తిన్న తరవాత ఓరెండు బద్దల్ని పెరుగన్నంలోకి మాత్రం మిగుల్చుకోవాలి. లేకపోతే ఆ అసంతృప్తి రోజంతా వెంటాడుతుంది. ఇది నిజం.
హొటళ్లలో వెనిగార్ ఆవకాయలవీ తిని అణగారిన ఆశలతో బతుకు జట్కాబండిని లాగే కుర్రాళ్లంతా నామాట విని త్వరగా పెళ్లిళ్లు చేసుకోండి. కొత్తావకాయ, కొత్తకాపురం బావుంటాయి.
శుభస్య శీఘ్రం!
....జగదీశ్ కొచ్చెర్లకోట
Next Story