ఈ తరం చూస్తున్న మొదటి పెద్ద పండుగ
జనవరి 22... ఇంకపై ప్రతీ భారతీయునికి, ముఖ్యంగా హిందువులకు మరచిపోలేని రోజు. అయోధ్యలో రాముని పున:పట్టాభిషేకం సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాలూ రామనామ స్మరణతో నిండిపోతున్నాయి.
జనవరి 22... ఇంకపై ప్రతీ భారతీయునికి, ముఖ్యంగా హిందువులకు మరచిపోలేని రోజు. అయోధ్యలో రాముని పున:పట్టాభిషేకం సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాలూ రామనామ స్మరణతో నిండిపోతున్నాయి. ‘సోమ సూర్యులు, సురలు, తారలు, ఆ మహాంబుధులు, అవనీ చంద్రులు... అంతా రామమయం’ అంటారు భద్రాచల రామదాసు. ప్రస్తుతం ఆసేతు హిమాచలం రామ నామస్మరణతో మారుమోగుతోంది. భారత దేశమంతా ఓ ఆధ్యాత్మిక భావనలో తేలుతున్న, ఈ తరం చూస్తున్న మొదటి పండుగ ఇది.
దేశంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయన్నింటికీ సోమవారం ఉదయం ఒంటిపూట సెలవు ప్రకటించారు. అయోధ్యకు నిలయమైన ఉత్తర ప్రదేశ్ కూడా 22నాడు పబ్లిక్ హాలీడేగా డిక్లేర్ చేసింది. భాజపా పాలిత రాష్ట్రాలన్నీ సోమవారం మధ్యాహ్నం వరకూ ఒంటిపూట సెలవుగా నిర్ణయించాయి. స్టాక్ మార్కెట్లన్నీ కూడా మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాతే తెరుచుకుంటాయి. ఇండిగో ఫ్లయిట్లో ప్రయాణిస్తున్న వారంతా ‘రామ్ ఆయేంగే’ (రాముడు వస్తున్నాడు) అనే పాటను పాడుతున్న దృశ్యం వైరల్ అయింది. ఆ దృశ్యాన్ని భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంచారు.
ఇక రామ మందిర ప్రతిష్ట ఉత్సవాలు 16 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపనతో వేడుకలు పూర్తవుతాయి. విగ్రహ ప్రతిష్టాపన సమయంలో గర్భగుడిలో ప్రధాని మోదీ, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాధ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, మందిరం ప్రధాన పూజారి సత్యేంద్రదాస్లు మాత్రమే రాముని వద్ద ఉంటారు. శుక్రవారం రాముని విగ్రహాన్ని గర్భగుడిలో స్థాపించారు. విగ్రహం కళ్లకు గంతలు కట్టారు. ప్రతిష్టాపన సమయంలో కళ్లకు గంతలు విప్పిన తర్వాత ముందుగా మోదీ, ఆ గర్భగుడిలో ఉన్న వారంతా దర్శించుకుంటారు.23 నుంచి ప్రజలు రాముని దర్శించుకోవచ్చు.
రామ మందిర పున:ప్రతిష్ట సందర్భంగా దేశంలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి అయోధ్యలో జరిగే ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం అన్నదానాలు ఏర్పాటు చేశారు.