Thu Dec 26 2024 00:46:19 GMT+0000 (Coordinated Universal Time)
రజనీకి గ్రేట్ రిలీఫ్
మంత్రి విడుదల రజనీకి పెద్ద రిలీఫ్ దక్కింది. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీగా గెలవడం ఊరట నిచ్చింది.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల పాటు ఒకే ఒక నేతను పక్కనపెట్టారన్న కామెంట్స్ నిన్నటి వరకూ వినిపించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయి మర్రి రాజశేఖర్ గెలవడంతో ఆయనకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్సీలందరూ 2029 వరకూ పదవిలో ఉంటారు. అంటే 2024 ఎన్నికలే కాదు, 2029 ఎన్నికల చివరి వరకూ వీరి పదవీ కాలం ఉండనుంది. కౌన్సిల్ వీళ్లంతా కీలకంగా మారనున్నారు. అందుకే జగన్ చివరిగా తమకు నమ్మకమైన వారికే ఎమ్మెల్సీ పదవులు జగన్ ఇచ్చారన్న వాదన పార్టీ నుంచి వినిపించింది. వైసీపీ నుంచి ఏడుగురు పోటీ చేసినా ఆరుగురే గెలిచారు. అందులో మర్రి రాజశేఖర్ ఉండటం మంత్రి విడుదల రజనీకి ఉపశమనం అనే చెప్పాలి.
ఊపిరి పీల్చుకున్న...
ఇందులో చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్పీ పదవి లభించడంతో మంత్రి విడదల రజనీ వర్గీయులు ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఫలితాలు రావడం, రాజశేఖర్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఇక ఆమెకు వచ్చే ఎన్నికల్లోనూ చిలకలూరిపేట టిక్కెట్ ఖాయమని చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ విడుదల రజనీకి టిక్కెట్ వస్తుందా? లేదా? అన్న అనుమానానికి తెరపడింది. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ కావడంతో ఇక తమ నేత విడదల రజనీకి తిరుగుండదని ఆమె వర్గీయులు భావిస్తున్నారు.
తొలి నుంచి లక్కీ పర్సన్...
విడదల రజనీ తొలి నుంచి లక్కీ పర్సన్ అనే చెప్పుకోవాలి. ఎన్ఆర్ఐగా ఉంటున్న విడదల రజనీ తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. టీడీపీలో ఉంటే తనకు చిలకలూరిపేట టిక్కెట్ ఎప్పుడూ దక్కదని భావించిన విడదల రజనీ 2019 ఎన్నికలకు ముందు పార్టీ మారారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అక్కడ ఉన్నంత వరకూ తాను టీడీపీలో ఎదిగేది ఉండదని, బీసీ నేతగా గుర్తింపు కూడా ఉండదని భావించిన విడదల రజనీ వైసీపీలోకి వెళ్లారు. వెళ్లడమే తరువాయి చిలకలూరిపేట టిక్కెట్ ను చేజిక్కించుకున్నారు. బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందిన మర్రి రాజశేఖర్‌ను కాదని జగన్ సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా ఆమెకు టిక్కెట్ దక్కింది.
మంత్రి పదవిని...
ఇక మంత్రి పదవి కూడా తొలిసారి గెలిచినా అదే ఫార్ములాలో ఆమెకు దక్కింది. తొలి సారి గెలిచారన్నది లేకుండా జగన్ కీలకమైన వైద్య ఆరోగ్యశాఖను ఆమెకు అప్పగించారు. అయితే మర్రి రాజశేఖర్ కు మొన్నటి వరకూ ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవి ఏదీ రాకపోవడంతో వచ్చే ఎన్నికల్లో విడదల రజనీకి టిక్కెట్ రాదన్న అంచనాలు వినిపించాయి. అయితే ఎమ్మెల్యే కోటా కింద మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడం, ఆయన గెలుపొందడంతో ఇక విడదల రజనీ డేంజర్ జోన్ లో లేనట్లేనని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గంతో పాటు బీసీలు కూడా ఎక్కువగా ఉండటంతో ఈసారి కూడా టిక్కెట్ తమనేతకేనన్న ధీమా మంత్రి విడదల రజనీ అనుచరులున్నారు. మరి చివరకు రజనీకి టిక్కెట్ వస్తుందా? లేదా? అన్నది వచ్చే ఎన్నికల సమయానికి తెలిసినా..ప్రస్తుతానికి మాత్రం ఆమె వర్గీయులు రిలీఫ్ ఫీలవుతున్నారు.
Next Story