Sat Dec 21 2024 05:14:25 GMT+0000 (Coordinated Universal Time)
ముక్కుసూటితనం.. లాభమా? నష్టమా?
నిర్మొహమాటంగా మాట్లాడే మనస్తత్వం రాజకీయాల్లో దెబ్బతీస్తుంది. నాడు ఎన్టీఆర్ నేడు జగన్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు.
తెలుగు సినిమా అభిమానులకు ఎన్టీవోడుగా ఆత్మీయుడైన ఎన్టీయార్ 1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు. పార్టీ స్థాపించి నేటికి సరిగ్గా నలభై ఏళ్ళు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీయార్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కొన్ని నెలలకే దేశంలో కాంగ్రెస్ పార్టీకి నేషనల్ ఫ్రంట్ పేరుతో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. సినిమాల్లో తను నటించిన వివిధ పాత్రల నేపధ్యం వల్లనో మరో కారణమో కానీ ఎన్టీయార్ కు పేదప్రజలంటే అభిమానం కాస్త ఎక్కువే. అందుకే ఆయన పాలనలో ప్రజలకు, ప్రత్యేకించి పేద ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, పనులు అనేకం జరిగాయి.
గట్టి దెబ్బలే...
ప్రజలు ఎన్టీయార్ లో శ్రీకృష్ణుణ్ణి, శ్రీరాముణ్ణి చూసుకునే వారు. అంతటి ప్రజాదరణ పొందారు ఎన్టీయార్. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో అనేక ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. సినిమాల్లో హీరో వేరు, సినిమాల్లో రాజకీయాలు వేరు. నిజ జీవితంలో హీరోలు, రాజకీయాలు వేరు అని తెలియడానికి ఆయన రెండు సందర్భాల్లో గట్టి దెబ్బలే తిన్నారు. ఎన్టీయార్ లో ముక్కుసూటితనం ఎక్కువ. అలాగే ఓ నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి. కానీ ఎన్టీయార్ కు అలాంటి జిత్తులు తెలియవు. బ్రహ్మ ముహూర్తాన నిద్ర లేచినప్పుడు తనకు ఏది అనిపిస్తుందో ఇంచుమించు అవే పనులు చేస్తుండేవారు.
సలహాదారులు కూడా...
ఎన్టీయార్ కు సలహాలిచ్చే సాహసం కూడా ఎవరూ చేసేవారు కాదు. నిర్ణయాలు ఆయనవే. వాటి ఫలితాలు కూడా ఆయనవే. ఓ నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేసే పరిస్థితి ఉండేది కాదు. మంత్రి వర్గాన్ని రద్దు చేయడం, శాసన సభను రద్దు చేయడం, నాయకులను పార్టీ నుండి బహిష్కరించడం, లక్ష్మీ పార్వతిని పెళ్ళి చేసుకోవడం ... ఇలా అనేకానేక నిర్ణయాలు ఎన్టీయార్ తీసుకున్నారు. వాటి ఫలితాలను కూడా ఆయనే అనుభవించారు. ఆయన రాజకీయ జీవితంలో తన నిర్ణయాలను పునఃసమీక్షించుకున్న సందర్భాలు లేవనే చెప్పాలి. ఆ నిర్ణయాల ఫలితాలు ఎలా ఉన్నా ఆయన వెనకడుగు వేయలేదు.
పునఃసమీక్ష...
ఇటీవల కాలంలో బాలకృష్ణ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తన నిర్ణయాలపై ఎన్టీయార్ పునఃసమీక్ష చేసేవారు కాదు. 1995 ఆగస్టు సంక్షోభంలో "కొన్ని అంశాలపై పునఃసమీక్ష అవసరం అని నేను మూడు గంటలసేపు బ్రతిమాలినా ఆయన వినలేదు" అని ఎన్టీయార్ గురించి చంద్రబాబు నాయుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్టీయార్ ముక్కుసూటి మనిషి కాబట్టి తన నిర్ణయాన్ని సమీక్షించుకున్నా, తిరుగుబాటు ఎమ్మెల్యేల తరపున రాయబారం నడిపిన చంద్రబాబు చెప్పిన అంశాలు అంగీకరించినా పరిస్థితులు భిన్నంగా ఉండేవి.
ఇందిర కూడా...
రాజకీయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించిన నేతల్లో ఎన్టీయార్ కంటే ముందు ఇందిరాగాంధీ ఉన్నారు. ఆమె కూడా పేద ప్రజల పట్ల ప్రత్యేక అభిమానంతో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన కామరాజ్, నిజలింగప్ప వంటి నేతలతో వైరం వచ్చినా, పార్టీ నుండి తనను బహిష్కరించినా తాను వేరే పార్టీ పెట్టుకోవాల్సి వచ్చినా ఇందిరా గాంధీ వెనకడుగు వేయలేదు. తన నిర్ణయాలను పునఃసమీక్షించుకోలేదు. ఉద్దండులను, కురువృద్ధులను ఢీ కొట్టి రాజకీయాలు నడిపారు.
తేడా ఏంటంటే..?
ఈ ఇద్దరి మధ్య తేడా ఏమంటే ఎదురు దెబ్బ తగిలినప్పుడు తట్టుకోగల వయసు ఇందిరా గాంధీకి ఉంది, ఎన్టీయార్ కు లేదు. అప్పటికే ఆయన ఏడు పదుల వయసులో ఉన్నారు. శరీరం, ఆరోగ్యం సహకరించక ఇందిరా గాంధీలా ఎదురు తిరిగి నిలబడలేక పోయారు. వయోభారం తన ముక్కుసూటి తనానికి అపజయాన్ని తెచ్చి పెట్టింది.
జగన్ కూడా...
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంచుమించు అలా ముక్కుసూటిగానే పోతున్నారు. అధికారం చేతిలో ఉండి, డబ్బుకు కొదవ లేకపోయినా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, అసెంబ్లీ నుండి మరో ఎమ్మెల్సీ స్థానంలో జగన్ ఓడిపోయారు. బేరసారాలు చేసి గెలవాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకంటే అధికారంలో ఉన్న పార్టీకే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అధికార పార్టీకి ఉండే వనరులు, అవకాశాలు కాస్త ఎక్కువే. అయినా తన ముక్కుసూటితనం ఆయనకు ఓటమిని తెచ్చింది.
లౌక్యంగా వ్యవహరించినా...
డబ్బు మాత్రమే కాదు కాస్త లౌక్యంగా వ్యవహరించినా ఓటమి దరిదాపుల్లోకి వచ్చేది కాదు. క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలతో లౌక్యంగా మాట్లాడినా, నాలుక మడతేసి హామీలు ఇచ్చినా ఆ నాలుగు ఓట్లు కాపాడుకోవడమే కాదు మరో నాలుగు ఓట్లు ప్రతిపక్షం నుండి తెచ్చుకునేవారు. కానీ అలా జరగలేదు. కారణం ఏమంటే ముక్కుసూటి తనం.తాను అనుకున్నదాన్నుండి, తాను తీసుకున్న నిర్ణయం నుండి పక్కకు తప్పుకోకపోవడం లేదా తన నిర్ణయాలను పునఃసమీక్షించుకోక పోవడం వంటి తత్త్వం.
అదే ఇబ్బంది పెడుతుందా?
ఈ ముక్కుసూటి తత్త్వం, పునఃసమీక్ష లేని నిర్ణయాలు తీసుకోవడం... తాత్కాలిక లబ్ది కోసం రాజకీయం చేయకపోవడం అప్పట్లో ఇందిరా గాంధీని, ఆ తర్వాత ఎన్టీయార్ ను ఇబ్బంది పెట్టింది. ఓటమికి గురిచేసింది. ఈ ముక్కుసూటి తత్వమే ఇప్పుడు జగన్ ను ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వారు గెలుపైనా, ఓటమైనా తమ ఖాతాలోనే వేసుకుంటారు. 2009లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీ పొత్తు ప్రతిపాదనలు తిరస్కరిస్తూ గెలుపైనా, ఓటమి అయినా పూర్తి బాధ్యత నాదే అన్నారు. ఆయన అప్పుడు గెలిచారు. అయితే ఈ ముక్కుసూటి తనానికి విజయం అన్నివేళలా వెన్నంటి రాదు. పరాజయం మాత్రం తరచూ తలుపు తోసుకుని వచ్చేస్తుంది.
గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్
Next Story