Mon Dec 23 2024 18:31:39 GMT+0000 (Coordinated Universal Time)
పంత్ ను నేను గుర్తుపట్టలేకపోయా
పంత్ ను కాపాడింది ఒక బస్సు డ్రైవర్. అటుగా వెళుతున్న బస్సును ఆపి డ్రైవర్ సుశీల్ మాన్ పంత్ ను కారు నుంచి బయటకు తీశారు
క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈరోజు తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగింది. ఢిల్లీ నుంచి రూర్కే వెళుతుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ ను ఢీకొన్న విషయం విదితమే. అయితే పంత్ ను కాపాడింది ఒక బస్సు డ్రైవర్. యాక్సిడెంట్ అని తెలిసిన వెంటనే అటుగా వెళుతున్న బస్సును ఆపి డ్రైవర్ సుశీల్ మాన్ కారు వద్దకు పరుగులు తీశాడు. అప్పటికే పంత్ కిటికీ అద్దాన్ని పగులగొట్టి బయటకు సగం వచ్చిన పంత్ ను తాను, తోటి ప్రయాణికులతో కలసి బయటకు లాగామని సుశీల్ మాన్ తెలిపారు.
ప్రయాణికులు గుర్తించడంతో...
అయితే పంత్ క్రికెటర్ అని తనకు తెలియదన్నారు. తాను క్రికెటర్ ను అని, తన తల్లికి ఫోన్ చేయాల్సిందిగా పంత్ తనను కోరాడని సుశీల్ మాన్ తెలిపారు. తాను క్రికెట్ ను చూడనని, అందుకే పంత్ ఎవరో తనకు తెలియదని, ఒక మనిషిగానే అతడిని కాపాడాలని ప్రయత్నించానని తెలిపారు. పంత్ ప్రమాదానికి గురై కనీనం నడిచేందుకు కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు. అతని బ్యాగులో ఏడు వేలు ఉన్నాయని, దానిని అంబులెన్స్ లో అతనికి అప్పగించామని తెలిపారు. బస్సులో ప్రయాణికులు మాత్రం పంత్ ను గుర్తుపట్టారని,వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా అంబులెన్స్ వచ్చిందన్నారు. తమ బస్సు హరిద్వార్ వైపు నుంచి వస్తుందన్నారు. పంత్ ఢిల్లీ నుంచి వస్తున్నాడని తెలిపారు.
అతివేగమే కారణమా?
అయితే పంత్ ప్రయాణిస్తున్న కారు అతి వేగం కారణంగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. వేగాన్ని అదుపు చేయలేక డివైడర్ ను ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆయనకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొన్నారు. బీసీసీఐ కూడా ఎప్పటికప్పడు పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటోంది. పంత్ త్వరగా కోలుకోవాలని పలువురు క్రికెటర్లు ఆకాంక్షించారు. పంత్ ఇప్పుడిప్పుడే కోలుకోలేరని, కొంత సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story