Mon Dec 23 2024 17:15:15 GMT+0000 (Coordinated Universal Time)
వీరప్పన్ ను అరెస్ట్ చేసిన ఏకైక వ్యక్తి తెలుగు వాడే తెలుసా..?
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ క్రూరత్వానికి ఓ తెలుగు ఐఎఫ్ఎస్ అధికారి కూడా బలయ్యాడు
వీరప్పన్.. గంధపు చెక్కల స్మగ్లర్ మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. తన సామ్రాజ్యానికి అడ్డొచ్చిన ఎంతో మంది ప్రభుత్వ అధికారులను కూడా వీరప్పన్ అతి క్రూరంగా చంపేశాడు. ఎన్నో ఇళ్లల్లో పెద్ద దిక్కు లేకుండా చేశాడు. అలా వీరప్పన్ క్రూరత్వానికి ఓ తెలుగు ఐఎఫ్ఎస్ అధికారి కూడా బలయ్యాడు. ఈ విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ముప్ఫయేళ్లయినా...?
కర్నాటక రాష్ట్రం లోని చామరాజనగర్ జిల్లాలో ఉన్న గోపీనాథం అనే కుగ్రామంలో 1991 నవంబర్ 10న IFS అధికారి పి శ్రీనివాస్ వీరప్పన్, అతడి బృందం చేతిలో వీరమరణం పొందాడు. ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ గ్రామస్థుల హృదయాల్లో నిలిచే ఉన్నాడు. ఆ ఊరి వాళ్లు ఎప్పటికీ పి.శ్రీనివాస్ ను మరచిపోరు.
ప్రజలకు దగ్గరగా...
"మేము చాలా పేదవాళ్లం. మేము అడిగిన వాటిని ఆయన ఎప్పుడూ కాదనలేదు. 'మీకు ఏ కష్టం వచ్చినా నన్ను అడగడానికి సంకోచించకండి. నేను మీ అన్నయ్యను' అని చెప్పేవారు. మేము ఎప్పుడు, ఎక్కడికెళ్లినా మాకు సహాయం చేస్తూ ఉండేవారు. మా సమస్యలపై ఆయన స్పందించాల్సిన అవసరం లేకపోయినా, బాధ్యతగా అన్న సమస్యలను పరిష్కరించేవారు "అని కుంజనూర్ గ్రామానికి చెందిన లక్ష్మి గుర్తుచేసుకున్నారు. పి శ్రీనివాస్ నిజమైన 'ప్రజల అధికారి' అని ఆమె చెప్పుకొచ్చారు. మానవత్వం కలగలిసి, మంచి హృదయం కలిగిన అటవీ అమరవీరుడు పి శ్రీనివాస్ మా గుండెల్లో చిరస్మరణీయుడని గ్రామస్థులు తెలిపారు.
వీరప్పన్‌ను అరెస్టు చేసిన...
1954 సెప్టెంబరు 12న ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించాడు పందిళ్లపల్లి శ్రీనివాస్. అనంత్ రావు, జయలక్ష్మి దంపతులకు పెద్ద కుమారుడు. స్కూల్స్, కాలేజీల్లో తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తన మాస్టర్స్ కోర్సులో టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. 1979లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కర్ణాటక కేడర్‌లో రిక్రూట్ అయిన తర్వాత, చామరాజనగర్‌లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ACF)గా అతని మొదటి పోస్టింగ్ లభించింది. అక్కడే శ్రీనివాస్ కు వీరప్పన్ కు దగ్గరగా వెళ్లే అవకాశం లభించింది. ఆ సమయంలో వీరప్పన్ అంత పెద్ద సామ్రాజ్యానికి అధిపతి కాలేదు. ఒక సాధారణ స్మగ్లర్.
అన్ని మార్గాలనూ మూసివేయడంతో....
ఏసీఎఫ్‌గా శ్రీనివాస్ కర్ణాటక అడవుల్లో బాధ్యతులు నిర్వర్తిస్తూ ఉన్న సమయంలో.. వేటగాళ్లు, స్మగ్లర్ల ప్లాన్ లను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉండేవాడు. అలాగే అక్కడి వేటగాళ్లు, స్మగ్లర్లందరినీ పట్టుకోవడానికి చాలా మంచి ప్లాన్ లను రచించాడు. ప్రతి ఒక్క నేరస్థుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడమే కాకుండా.. ఆ స్మగ్లర్లు ఎలా ఉంటారు అనే విషయాన్ని వారి ఫోటోలను తీసి, బహిరంగ పరిచి ప్రపంచానికి తెలియజేశాడు. తప్పించుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను శ్రీనివాస్ మూసివేయించాడు. గణనీయమైన సంఖ్యలో స్మగ్లర్లు, వేటగాళ్ళను అడ్డుకున్నాడు శ్రీనివాస్. తక్కువ సమయంలోనే శ్రీనివాస్‌కు చామరాజనగర్‌లో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) హోదా లభించింది. నవంబర్ 16-17, 1986లో బెంగుళూరులో జరుగుతున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుపై దేశం దృష్టి ఉన్న సమయంలో, శ్రీనివాస్ ఒక సాహసోపేతమైన ఆపరేషన్ ను పూర్తి చేసి వీరప్పన్‌ను విజయవంతంగా పట్టుకున్నాడు.
పారిపోవడంతో...
బుడిపడగ ఫారెస్ట్ రెస్ట్ హౌస్‌లో వీరప్పన్ ను నిర్బంధించాడు శ్రీనివాస్. విచారణ జరిపి.. కొన్ని ప్రధాన గుహలు మరియు స్మగ్లింగ్ కు సిద్ధం చేసిన గంధపు చెక్కలను బహిర్గతం చేశాడు. శ్రీనివాస్ కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో దాడులు చేసి పెద్ద మొత్తంలో దొంగిలించిన చందనాన్ని సేకరించాడు. అయితే శ్రీనివాస్ లేని సమయంలో వీరప్పన్ ఫారెస్ట్ రెస్ట్ హౌస్ నుండి పారిపోయాడు.
ప్రజల అధికారి...
వీరప్పన్ ను పట్టుకున్నా కూడా అతడు పారిపోయాడు. అందుకు కారణం కొందరు అధికారులు. భద్రతా అధికారుల లోపం అయినప్పటికీ, శ్రీనివాస్ వీరప్పన్ తప్పిపోయాడనే నిందను తనపై వేసుకున్నాడు. వీరప్పన్‌ను న్యాయస్థానంలోకి తీసుకురావడానికి తిరిగి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. స్థానిక గ్రామస్తులతో స్నేహం చేస్తూ.. తన మిషన్ కోసం వారి సహాయం కోరాడు.
గ్రామస్థులతో....
శ్రీనివాస్ రానంత వరకు గ్రామస్తులు, అటవీ అధికారుల మధ్య సంబంధాలు పెద్దగా ఉండేవి కాదు. పోలీసులంటే భయపడడమో, లేకపోతే పోలీసులు వస్తున్నారనే సమాచారం స్మగ్లర్లకు ఇవ్వడమో గ్రామస్థులు చేస్తుండేవారు. ఈ పరిస్థితులను మార్చడానికి శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు. ఆయన నేతృత్వంలో నిర్వహించిన కార్యకలాపాలు గ్రామస్తులను ప్రభావితం చేశాయి. కనిపించని అడ్డంకులను ఛేదించి గ్రామస్తులతో కలిసిపోయిన మొట్ట మొదటి అధికారి శ్రీనివాస్. తన వివేకవంతమైన కార్యకలాపాలలో వారికి శిక్షణ ఇచ్చి మమేకం అయ్యాడు. అటవీ సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశాడు.
ప్రముఖ పాత్రికేయుడు ఏమన్నారంటే...?
పి శ్రీనివాస్‌పై ప్రముఖ పాత్రికేయుడు రమేష్ మీనన్ కొన్ని విషయాలను తెలియజేశారు. "అతను గ్రామస్థులతో స్నేహం చేయడంలో ముందున్నాడు. వారి ఇళ్లలోనే బస చేశాడు. వారి సమస్యలను విన్నాడు. వాటికి పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేశారు. పర్యావరణ వ్యవస్థలో ఏనుగులను ఎందుకు జీవించనివ్వాలి, చందనం చెట్లను ఎందుకు నరికివేయకూడదనే విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశాడు. అతను వీరప్పన్ పెరిగిన గ్రామమైన గోపీనాథంలో నివసించడం ప్రారంభించాడు." అని రమేష్ మీనన్ చెప్పుకొచ్చారు.
దొంగలలో మార్పు.. పునరావాసం...
శ్రీనివాస్‌కి తన స్వగ్రామంలో పెరుగుతున్న ప్రజాదరణ వీరప్పన్‌ను కలవరపరిచింది. ఇప్పుడు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చేవారు చాలా మందే ఉన్నారు. శ్రీనివాస్ సైనికులుగా గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఒక హెచ్చరికను పంపడానికి.. వీరప్పన్ స్థానిక ఇన్ఫార్మర్లలో కొందరిని హత్య చేసి, వారి నరికిన తలలను గ్రామంలో వేలాడదీశాడు. తాను దోచుకున్న సంపదలో కొంత భాగాన్ని గ్రామస్తులకు పంచాడు.
వారికి జీవనోపాధి కల్పించి...
ఇవేవీ శ్రీనివాస్ ను లక్ష్యం నుండి దూరం చేయలేదు. శ్రీనివాస్ సత్యాన్వేషణ సూత్రాన్ని విశ్వసించేవాడు. నేరస్థులకు శిక్షకు బదులుగా వారిని సంస్కరించడానికి అహింస పద్ధతులను సూచించాడు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అనేక మంది దొంగలు, స్మగ్లర్లకు పునరావాసం కల్పించాడు. వీరప్పన్ మాజీ ముఠా సభ్యులను ప్రధాన స్రవంతి పనిలోకి తీసుకుని వచ్చి.. వారికి పనులను కల్పించాడు. అతని విధానం ఎంతో ప్రభావాన్ని చూపింది. 1990లో వీరప్పన్‌కి చాలా మంది సహచరులు అతని ముందు లొంగిపోయారు. విచారణ అనంతరం వారందరినీ విడుదల చేసి పునరావాసం కల్పించేలా శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
గొప్ప మనిషి.. ఒక పరోపకారి
శ్రీనివాస్ చర్యలు, చేసే సహాయాలు అతన్ని అట్టడుగు వర్గాలకు చేరువ చేసింది. మారుమూల గిరిజన గ్రామాలలో తాగునీటి సౌకర్యాలను సృష్టించాడు. చాలా గ్రామాలకు రోడ్లు నిర్మించాడు. గోపీనాథంలో మొబైల్ డిస్పెన్సరీని కూడా ప్రారంభించాడు. వైద్య సిబ్బంది కొరత ఏర్పడినప్పుడు, అతను డిస్పెన్సరీలో వైద్యులకు సహాయం చేయడానికి ప్రాథమిక వైద్యం నేర్చుకున్నాడు. తన సొంత డబ్బులతో ఇళ్లులేని గిరిజనులకు ఇళ్లు కట్టించాడు. ఆసక్తిగల అటవీ ప్రేమికుడిగా అనేక డ్రైవ్‌లను నిర్వహించాడు. అటవీ శాఖ కార్యాలయాల కోసం స్థిరమైన ప్రణాళికను సూచించాడు. అతని అటవీ అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. "అతను వీరప్పన్ సోదరి మారిని డిస్పెన్సరీలో నియమించుకున్నాడు. వీరప్పన్ సోదరుడు అర్జున తన చట్టవిరుద్ధమైన పనులను విడిచిపెట్టమని సలహా ఇచ్చేందుకు తన శాయశక్తులా ప్రయత్నించాడు" అని డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ అధికారిక నివేదిక పేర్కొంది.
దారుణ హత్య....
శ్రీనివాస్‌ను నిజమైన సంఘ సంస్కర్తగా సమాజం కీర్తిస్తోంది. ఇక వీరప్పన్ కూడా శ్రీనివాస్ ను చంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. వీరప్పన్ శ్రీనివాస్ మంచితనాన్ని అత్యంత దారుణంగా ఉపయోగించుకున్నాడు. 1991 నవంబరు 9 ఉదయం శ్రీనివాస్‌కు వైర్లెస్ సందేశం వచ్చింది. వీరప్పన్ లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడని.. అయితే శ్రీనివాస్ తనను వ్యక్తిగతంగా కలవాలని కోరాడు. ఎటువంటి ఆయుధం లేకుండా, సెక్యూరిటీ లేకుండా శ్రీనివాస్ ను కలుసుకోవాలని వీరప్పన్ చెప్పాడు.
నమ్మి వెళ్లి....
ప్రజల మంచితనాన్ని నమ్మిన శ్రీనివాస్ వీరప్పన్ చెప్పినట్లుగా గుహ వైపు బయలుదేరాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) మద్దతు లేకుండా వెళ్లడమే అతడు చేసిన తప్పు. ఒంటరిగా ఉన్న నిరాయుధుడైన శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యాడనే దారుణ వార్త ప్రజలకు తెలిసింది. మరుసటి రోజు ఉదయం వీరప్పన్ మనుషులు అతనిని కాల్చి చంపారు. తరువాత అతని తల నరికారు. కేవలం 37 ఏళ్ల వయసులోనే శ్రీనివాస్ ప్రాణాలను కోల్పోయాడు.
ఇప్పటికీ అక్కడ...?
అతని మరణానంతరం 26 జనవరి 1992న కీర్తి చక్ర పురస్కారం లభించింది. అతని దారుణ హత్య ఇప్పటికీ గోపీనాథం గ్రామస్తులను, కర్ణాటక, తమిళనాడులోని అడవులను వెంటాడుతూనే ఉంది. 2004లో వీరప్పన్ హతమైనప్పుడు తమ సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు గ్రామస్థులు ఎంతగానో సంతోషించారు. పి శ్రీనివాస్ భారతదేశ చరిత్రలో మరచిపోలేని అధ్యాయం కావచ్చు, కానీ అతని జీవితం, పని కర్ణాటక-తమిళనాడులోని అటవీ కథలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆయన్ను ఇంకా అక్కడ ఆరాధిస్తూనే ఉన్నారు.
- న్యూస్ డెస్క్ ప్రత్యేక విభాగం
Next Story