Sat Nov 23 2024 01:17:04 GMT+0000 (Coordinated Universal Time)
రాజుగారి ఎత్తుగడ టీడీపీకి లాభమేనా?
సాధారణ ఎన్నికలకు ముందు ఎంపీ సీటులో వైసీపీ ఓటమి పాలయితే నైతికంగా ఆ పార్టీకి దెబ్బ అవుతుంది. టీడీపీకి లాభం చేకూరుతుంది.
రెండేళ్ల కోసం ఉప ఎన్నిక జరగాలా? రఘురామ కృష్ణరాజు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్తానని సవాల్ విసిరారు. దీనిపై బీజేపీ నుంచి సానకూలత కన్పించడం లేదట. ఆయన రాజీనామా చేసి పార్టీ లో చేరేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఉప ఎన్నిక నిర్వహణ సబబు కాదన్న వ్యాఖ్యలు కేంద్రం పెద్దల నుంచే విన్పించాయట.
బీజేపీ అభ్యంతరం...?
అందుకే రఘురామ కృష్ణ రాజు సందిగ్దంలో పడ్డారు. ఆయన వైసీపీలో గత రెండేళ్లుగా రెబల్ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు. రచ్చబండ పేరుతో రోజూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ఇప్పటికే ఆయన పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అనర్హత వేటు అంశం ప్రస్తుతం స్పీకర్ పరిధిలో ఉంది. పెండింగ్ లో పెట్టారు. అనర్హత వేటు విషయాన్ని పక్కన పెట్టి కొందరు చేసిన సూచనల మేరకు ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు తెలిసింది. రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకున్నారు.
వైసీపీని నైతికంగా....
తాను రాజీనామా చేసి బీజేపీ తరుపున పోటీ చేస్తే గెలుపు ఖాయమని రఘురామ కృష్ణరాజు భావిస్తున్నారు. దీనివల్ల తనకు కలిగే ప్రయోజనం కన్నా వైసీపీకి జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని పలువురు ఆయనకు నూరిపోశారు. సాధారణ ఎన్నికలకు ముందు ఒక పార్లమెంటులో వైసీపీ ఓటమి పాలయితే నైతికంగా ఆ పార్టీకి దెబ్బ అవుతుందని, దీంతో టీడీపీ పుంజుకునే అవకాశముందని కొందరు ఆయనకు ఎక్కించినట్లు తెలిసింది. అందుకోసమే రఘురామ కృష్ణరాజు రాజీనామా చేస్తానని ప్రకటన చేశారంటున్నారు.
విషయం తెలిసిన...
టీడీపీకి లాభం చేకూర్చడం కోసమే రఘురామ కృష్ణరాజు రాజీనామా చేస్తున్నారని తెలిసిన బీజేపీ నేతలు అందుకు అంగీకరించడం లేదని తెలిసింది. పార్టీలోకి వద్దని చెప్పకపోయినా ఎంపీ పదవికి రాజీనామా చేయవద్దని, రెండేళ్లలో ఉప ఎన్నిక అనవసరమని కొందరు బీజేపీ నేతలు రఘురామ కృష్ణరాజుతో అన్నట్లు సమాచారం. రఘురామ కృష్ణరాజు ఎత్తుగడ తెలిసే బీజేపీ ఎంపీ పదవికి రాజీనామాకు అభ్యంతరం తెలిపారంటున్నారు. కానీ మరోవైపు నుంచి రఘురామ కృష్ణరాజు పై రాజీనామా చేయాలని వత్తిడి పెరుగుతుందట. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.
Next Story