Fri Nov 15 2024 06:44:33 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాన్స్ లో నిరాశ.. క్యాడర్ లో కన్ఫ్యూ జన్
పవన్ కల్యాణ్ పాతికేళ్ల పాటు రాజకీయం చేయాలనుకుంటే ఎప్పటికైనా సీఎం అయ్యే ఛాన్స్ పవన్ కు లేకపోలేదన్నది విశ్లేషకుల అభిప్రాయం
అవును... పవన్ కల్యాణ్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు. ఇప్పుడు జనసేన పార్టీలోనే వినిపిస్తున్న టాక్ ఇది. సమయం కోసం వేచి చూడకుండా ఆవేశంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సీఎం కుర్చీని దూరం చేస్తున్నాయని పార్టీ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో ఆలోచన అవసరం. ఆవేశం అనర్థదాయకం. వెయిట్ చేసి చూడటమే లీడర్ లక్షణం. కానీ పవన్ కల్యాణ్ కు ఎంత మాత్రం ఆలోచన లేదని పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డ్ లో అంటున్నారు. రేపటి నుంచి యుద్ధం మొదలయిందని సవాల్ విసిరిన కొద్దిసేపటికే చంద్రబాబుతో భేటీతో ఆయన లో ఉన్న నాయకత్వానికి, చేసిన సవాళ్లకు, అరచిని అరుపులకు విలువ లేకుండా పోయిందన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి.
లీడర్ కు...
లీడర్ అనే వాడు నలుగురిని నడిపించాలి. తను నడిచిన దారిలో నలుగురిని తీసుకెళ్లగలగాలి. పది మందికి దారి చూపించాలి. తాను ఇతరుల డైరెక్షన్ లో అస్సలు పనిచేయకూడదు. పాతికేళ్లు రాజకీయాలు చేయడానికే వచ్చానని పవన్ పదే పదే చెప్పారు. మరో ఐదేళ్లు వెయిట్ చేసే ఓపిక మాత్రం లేదు. విశాఖలో తనను హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదన్న ఒకే ఒక్క కారణం.. ఆవేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం మరో పదేళ్ల పాటు వెనక్కు నెట్టేసింది. ఆయనను అభిమానించే వారు కావచ్చు.. ఆయన సొంత సామాజికవర్గం కావచ్చు. ఎవరైనా ఇప్పుడు ఒకటే ప్రశ్న. పవన్ కు నిలకడలేదా? ఎప్పుడు ఏం చేయాలో తెలియదా? అసలు పాలిటిక్స్ చేయడనాకే ఆయన వచ్చాడా. అన్న అనుమానం కలుగుతున్నాయి.
పాతికేళ్లు రాజకీయాలంటూ....
పవన్ కల్యాణ్ కు భవిష్యత్ ఉంది. చంద్రబాబు తర్వాత టీడీపీకి గడ్డుకాలమే. ఆ సంగతి అందరికీ తెలుసు. ఈలోపు పార్టీని బలోపేతం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో క్యాడర్ ను పెంచుకోవాలి. జనంలో నమ్మకం కలిగించాలి. ఒక్కరోజులో ఇది సాధ్యం కాదు. కానీ 2014లో పార్టీ పెట్టినా ఇప్పటి వరకూ పవన్ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. ఎవరినీ నమ్మరు. ఎవరికీ కీలక పదవులు అప్పగించరు. అంతా తానే అయి వ్యవహరించాలనుకుంటారు. ఎందుకంటే ఆయన ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాదు కనుక. తాను గెలవాలి అనుకోవాలి. తాను ముఖ్యమంత్రి కావాలి అని భావించాలి. తన వారందరికీ పదవులు ఇవ్వగలగలగాలి అన్న నమ్మకం తనకు ఉండాలి. అప్పుడే ఒక పార్టీని నడిపించగలరు. ప్రజలు కూడా ఆయన వెంట నడుస్తారు. కానీ పవన్ ది విరుద్ధమైన వైఖరి. కొంచెం ఆవేశం వస్తే చాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలియదు.
పక్కోడిని సీఎం చేయడానికి...
నిజంగా పాతికేళ్ల పాటు రాజకీయం చేయాలనుకుంటే ఎప్పటికైనా సీఎం అయ్యే ఛాన్స్ పవన్ కు లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. కానీ అర్జంటుగా జగన్ ను దించేయాలన్న ఏకైక కారణమే ఆయనను మళ్లీ పదేళ్లు వెనక్కు నెట్టేసిందని మేధావులు చెబుతున్నారు. ప్రత్యర్థిని ఓడించాలన్న ఆలోచన కన్నా, మనం ఎలా గెలవాలన్న ఆలోచన చేస్తే అది అందలం వరకూ తీసుకెళుతుంది. కానీ పవన్ మాత్రం ఇతరులను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధపడటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతలు కూడా పునరాలోచనలో పడ్డారు. కొందరు పార్టీ నేతలు ఇప్పటికే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే కొందరు పార్టీని వీడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Next Story