Mon Dec 23 2024 15:11:36 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే ఎన్నికల్లో ఇక పోటీ చేయరట
పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆదినారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. ఒక్క కుటుంబంలో రెండు పార్టీల్లో ఉండటం రాయలసీమలో చాలా అరుదు. కుటుంబానికి ఎక్కువ విలువలిస్తారు. అన్నదమ్ములందరూ కలసి ఉంటారు. ఉమ్మడి కుటుంబాలను చూడాలంటే ఇప్పటీకీ రాయలసీమకు వెళ్లాల్సిందే. అటువంటి సీమలోనూ ఇప్పుడు సీన్ మారింది. అక్కడ కూడా కుటుంబాల్లో రాజకీయ విభేదాలు తలెత్తుతున్నాయి. అందుకు ఉదాహరణ జమ్మలమడుగులోని దేవగుడి కుటుంబం.
రెండు కుటుంబాల....
దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరుధ్యంతో పాటు కక్ష్యలు కూడా ఉన్నాయి. హత్యలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో దేవగుడి కుటుంబం అంతా ఏకంగా పొన్నపురెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొంటుంది. వరసగా రెండు సార్లు గెలిచిన ఆదినారాయణరెడ్డి 2014లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కుటుంబంలో చిచ్చుపెట్టిందనే చెప్పాలి. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిపోయి మంత్రి పదవిని తెచ్చుకున్నారు.
కుటుంబంలో...
తన అన్న నారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. అయితే ఆయన అన్న నారాయణరెడ్డి మాత్రం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కుమారుడు భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జిని చేయాలన్న ఆయన డిమాండ్ కు చంద్రబాబు అంగీకరించడంతో నారాయణరెడ్డి తన కుమారుడు భూపేష్ రెడ్డితో కలసి పసుపు కండువా కప్పేసుకున్నారు.
పోటీకి దూరంగా...
కానీ ఇప్పుడు జమ్మలమడుగులో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ ఎమ్మెల్సీ సుధీర్ రెడ్డితో పాటు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కూడా తోడయ్యారు. వైసీపీని ఎదుర్కొనాలంటే దేవగుడి కుటుంబం ఒక్కటవ్వాల్సిందే. లేకుంటే వైసీపీ మీద గెలుపు సాధ్యం కాదు. కానీ చివరి నిమిషంలోనైనా ఆదినారాయణరెడ్డి తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డికి మద్దతిస్తారన్న నమ్మకంతో దేవగుడి వర్గం ఉంది. మొత్తం మీద దేవగుడి కుటుంబంలో తలెత్తిన రాజకీయ విభేదాలు సమసిపోతాయని ఆయన వర్గం భావిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆదినారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లేదన్నది ఆయన సన్నిహితుల నుంచి విన్పిస్తున్న మాట. తన అన్న కుమారుడికి వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వాలనే ఆయన ఉద్దేశ్యంగా కన్పిస్తుంది.
Next Story