ఎవరీ అడ్వకేట్ రామారావు..?
తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు సంచలనంగా మారాయి. సరిగ్గా కొడంగల్ లో రేవంత రెడ్డి ప్రచారం ప్రారంభించే రోజే ఈ దాడులు ప్రారంభమయ్యాయి. మొదట ఐటీతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగిందని... డీఆర్ఐ కూడా వచ్చేస్తోందని బాగా ప్రచారం జరిగింది. డీఆర్ఐ అయితే నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదని, నేరుగా అరెస్టే అనే ఊహాగానాలు కూడా వచ్చాయి. రేవంత్ రెడ్డి సైతం నిన్న కోస్గిలో హైదరాబాద్ కు బయలుదేరే ముందు ప్రచార సభలో మాట్లాడుతూ... తనను అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పారు. వాస్తవానికి ఆయన ఇటీవల రెండుమూడు సార్లు తనపై కుట్ర జరుగుతోందని, అరెస్టు చేస్తారని మీడియాతో చెప్పారు. రేవంత్ రెడ్డిపై ఆరోపణలు ఇవే అని నిన్న సాయంత్రం నుండి ఇంచుమించు అన్ని మీడియా ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నారు.
ఏ పార్టీతోనూ సంబంధం లేదు..!
రేవంత్ రెడ్డిపై ఆదాయ పన్ను శాఖ నజర్ వెనక ఇమ్మిని రామారావు అనే అడ్వకేట్ చేసిన ప్రయత్నమే కారణమని తెలుస్తోంది. ఆయన రేవంత్ రెడ్డిపై గత జులై లోనే ధర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డిపై తనకు వ్యక్తిగత కక్ష ఏమీ లేదని, కేవలం ఓ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తుంటే రేవంత్ రెడ్డి అక్రమాలకు సంబంధించి యాధృచ్ఛికంగా తెలిసిందని... దీంతో కొంత లోతుగా వెళ్లి పరిశీలిస్తే భారీగా అక్రమాలు జరిగినట్లు తెలిసిందని ఆయన చెబుతున్నారు. తన ఫిర్యాదు మేరకే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని అంటున్నారు. తాను ఏ పార్టీకీ అనుబంధంగా లేనని, కేవలం అడ్వకేట్ గా అక్రమాలు జరిగాయని తెలిసి మాత్రమే స్పందించి ఫిర్యాదు చేశానని చెబుతున్నారు.
రామారావుపై రౌడీ షీట్ ఉందా..?
అయితే, రేవంత్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నేతల వాదన మాత్రం మరో రకంగా ఉంది. సికింద్రాబాద్ పద్మారావు నగర్ కు చెందిన రామారావు అధికార పార్టీ ప్రోద్భలంతోనే రేవంత్ పై ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నారు. ఇక రామారావు గురించి కొన్ని విషయాలను సైతం బయటకు తీశారు. ముఖ్యంగా రామారావుపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో భూకబ్జా, బెదిరింపులకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. రౌడీషీట్ కూడా నమోదైందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పేపర్ కట్టింగ్ లు, వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ, తనపై రౌడీ షీట్ లేదని రామారావు అంటున్నారు. ఓ భూకబ్జాదారుడి నుంచి ఓ మహిళను కాపాడే ప్రయత్నంలోనే తనపై కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు. తనపై కేసుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, రేవంత్ రెడ్డిపై ఫిర్యాదుకు తన కేసులకు సంబంధం లేదనేది రామారావు వాదన. ఇక నిన్న సాయంత్రం ఓ టీవీ చానల్ లో జరిగిన చర్చలో రామారావు మాట్లాడుతూ... ఓ సామాజకవర్గంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా పరిగణించానని చెప్పారు. దీంతో ఈ ఫిర్యాదు వెనక రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.