Mon Dec 23 2024 13:12:50 GMT+0000 (Coordinated Universal Time)
సన్యాసే బెటర్.. అదే జనానికి నచ్చింది
గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ యూపీ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అదే బీజేపీ విజయానికి కారణమయింది
ఉత్తర్ ప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో ఇప్పటి వరకూ ఎన్నో పార్టీలు పాలించాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఉత్తర్ ప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ పాలించింది. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కూడా అధికారంలోకి వచ్చాయి. కానీ యూపీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. దాదాపు 85 జిల్లాలున్న ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధిని అన్ని పార్టీలూ విస్మరించాయి.
అభివృద్ధిపైనే....
అయితే గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ యూపీ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. యూపీలో విద్యుత్తు సరఫరా లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. చీకటిలోనే మగ్గిపోతున్నాయి. ఉపాధి అవకాశాలు లేవు. కేవలం నగరాల్లోనే అభివృద్ధి కన్పిస్తుంది తప్పించి గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పాలి. కానీ యోగి ఆదిత్యానాధ్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీ పరిస్థిితి కొంత మెరుగుపడిందనే చెప్పాలి.
సన్యాసిగా....
యోగి ఆదిత్యానాధ్ హిందూ అతివాద రాజకీయ నాయకుడు. 22 ఏళ్ల వయసులోనే ఆయన సన్యాసం స్వీకరించారు. గొరఖ్ ఫూర్ మఠాధిపతిగా వ్యవహరించారు. యూపీలో జన జాగరణ అభియాన్ ను యోగి ప్రారంభించారు. 1998లో తొలిసారి గొరఖ్ పూర్ నుంచి గెలిచారు. 2017లో బీజేపీ యూపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా హైకమాండ్ యోగిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. రెండోసారి విజయానికి అది సక్సెస్ గా మారింది.
కేంద్రం సహకారంతో.....
యూపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పుష్కలంగా సహకారం అందించింది. దాదాపు 8 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించింది. అన్ని గ్రామాలకు విద్యుత్ ను సరఫరా చేసింది. గ్రామీణ రోడ్లను మెరుగుపర్చింది. ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలను ఏర్పాటు చేసింది. మరోవైపు పేదరికాన్ని కొంత మేర తొలగించడానికి సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఇక పూర్తిగా క్షీణించిపోయిన శాంతిభద్రతలను యోగి కంట్రోల్ లో పెట్టారు. అదే జనానికి బాగా నచ్చింది. అయోధ్య ఆలయ నిర్మాణం కూడా కలసి వచ్చింది. అదే యోగి విజయానికి కారణమయింది. యోగి రెండోసారి యూపీ ముఖ్యమంత్రి కాబోతున్నారు.
Next Story