Thu Jan 16 2025 13:59:53 GMT+0000 (Coordinated Universal Time)
అంతా మీరే చేశారు..!!
2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా వదిలేశారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిందంతా చేసి ఇప్పుడు అంతా అయిపోయాక మళ్లీ మొదటికొస్తే ఎలా? ఈ ప్రశ్నలు వేస్తుంది తెలంగాణ టీడీపీ నేతలే. రాష్ట్ర విభజన జరిగితే ఏంటి? పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అధినేతపైనే ఉంటుంది. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా వదిలేశారు. ఇక ఏపీకి తాను శాశ్వత ముఖ్యమంత్రినని భ్రమించారు. జగన్ ను నమ్మరని, తనకు ఇక తిరుగులేదని భావించిన చంద్రబాబు తెలంగాణ పార్టీని పూర్తిగా వదిలేశారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం పార్టీ కేంద్ర కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదు.
అధికారంలో ఉన్నప్పుడు...
ముఖ్యమంత్రిగా ఉండి ఏపీని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సమయమంతా అక్కడే గడిపారు. దీంతో తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జారిపోయారు. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చెప్పుకునే చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీటీడీపీ గురించి అస్సలు పట్టించుకోలేదు. తనకు నమ్మకమైన వ్యక్తులకు నెలవారీ జీతం ఇచ్చి అధ్యక్షుడిగా నియమించుకున్నారు. కీలకమైన నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయినా పట్టించుకోలేదు. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. తమది ఆంధ్రపార్టీగా ముద్ర పడటంతో ఇక తెలంగాణలో ఏం చేసినా చెల్లదని చంద్రబాబు ఒక అభిప్రాయానికి వచ్చినట్లే ఉంది.
ఏపీలో ఓటమి తర్వాత...
అయితే చంద్రబాబు నమ్మి ఎవరి చేతుల్లోనూ పార్టీ పెట్టరు. అంతా తానే చూసుకోవాలనే తత్వం. మొన్నటి వరకూ ఎల్.రమణ తన మాట జవదాటని నేత కావడంతో ఆయనను రెండుసార్లు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఏపీలో కూడా టీడీపీ అధికారం కోల్పోవడంతో టీడీపీలో పార్టీ కార్యక్రమాలను పూర్తిగా నిలిపేశారు. ఇక పార్టీలో ఉండి రాజకీయంగా మనుగడ లేదని భావించిన రమణకు హుజూరాబాద్ ఉప ఎన్నిక కలిసి వచ్చింది. టీఆర్ఎస్ నుంచి భారీ ఆఫర్ రావడంతో ఆయన వెళ్లిపోయారు. తర్వాత బక్కని నరసింహులును పెట్టినా ఆర్థికంగా పార్టీని నడపలేకపోతున్నారు. దీంతో చంద్రబాబుకు కాసాని జ్ఞానేశ్వర్ రూపంలో దొరకాడు. ఆర్థికంగా పార్టీని ఆదుకునేందుకు కాసాని పనికి వస్తాడని భావించిన చంద్రబాబు ఆయనను అధ్యక్షుడిని చేశారు.
ఖమ్మం సభలో....
నిజానికి ఖమ్మంలో సభ ఉంటుందని గోదావరికి వరదలు వచ్చినప్పుడే చంద్రబాబు ప్రకటించారు. కానీ ఖమ్మం సభకు ఖర్చుకు వెనకాడిన బాబు కాసాని వచ్చే వరకూ వెయిట్ చేశారన్నది కూడా పార్టీలో జరుగుతున్న చర్చ. ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో నేతలు ఎవరూ లేరు. క్యాడర్ కూడా అనుమానమే. ఎక్కడక్కడ క్యాడర్ కూడా పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్లిపోయింది. ఓటు బ్యాంకు సయితం ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు. నాటి ఎన్టీఆర్ టీడీపీ ఉన్నప్పుడు జనరేషన్ కాదు. చంద్రబాబును చూసి ఇప్పుడు ఓట్లేసే అవకాశమే లేదు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం బలంగా ఉన్న చోట మాత్రమే అదికొంత ప్రభావం చూపుతుంది. ఇంత సభ పెట్టినా కేసీఆర్ ను విమర్శించింది లేదు. కేవలం ఆత్మస్తుతికే పరిమితమయ్యారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీని కలుపుకునే ప్రయత్నం ఏ పార్టీ చేయదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story