Fri Nov 08 2024 07:05:47 GMT+0000 (Coordinated Universal Time)
కన్నడ ఫలితాలే కలిపాయా?
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో కొంత బెరుకు బయలుదేరింది. అందుకే చంద్రబాబుకు వెంటనే అపాయింట్మెంట్ దొరికింది.
రాజకీయాలు ఎప్పుడూ అంతే. వాటిని తప్పు పట్టలేం. అలాగని సమ్మతించలేం. రాజకీయాల్లో సిగ్గూ, లజ్జలు ఉండవు. నిజాలు.. ఇజాలు పైకి మాత్రమే కనిపిస్తాయి. అవసరం ముఖ్యం. అధికారమే అంతిమ లక్ష్యం. ఏదైనా పవర్ కావాలి. పవర్ కావాలంటే గతంలో చేసుకున్న విమర్శలు... విసుర్లు మరిచిపోతారు. ఒకరినొకరిపై విషం గక్కుకున్న విషయాన్ని కూడా పక్కన పెడతారు. ఎందుకంటే తమకు అధికారం ముఖ్యం. కౌగిలింతలు.. కవ్వింతలు క్షణికమే. గతంలో రాజకీయాలు చూసిన వారికి ఇది వింతగానే అనిపిస్తుంది. కొత్తగా కనపడుతుంది. కానీ అందులో ఆశ్చర్యపడాల్సిన పనేలేదు. చెప్పే వాళ్ల నోరు అంతే. వినేవాళ్లకు రోత అనిపించదు. ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ మధ్య మరోసారి మైత్రికి సిద్ధమయ్యాయని అనుకోవడమూ అంతే.
నాలుగేళ్ల నుంచి...
నిజానికి ఎవరి అవసరం ఎవరికి ఉందో జనానికి అర్థం కాదు. కానీ ఇద్దరికీ ఒకరి సాయం మరొకరికి అవసరం. అందుకే పాత విషయాలను మరిచిపోయి ఈ కౌగిలింతలు... సరికొత్త సయ్యాటలు. నిజానికి బీజేపీకి పెద్దగా అవసరం లేదని ఎవరైనా అనుకోవచ్చు. పాత రాజులు మాదిరి అన్ని దేశాలను కబళించాలన్న కోరిక నేటి నేతలకు అన్ని రాష్ట్రాల్లో తమ జెండా ఎగరాలన్న ఆకాంక్ష ఉచ్ఛ నీచాలను మరిపిస్తుంది. అందులో భాగంగానే ఈ చర్చలు. మంతనాలు. అమిత్ షాను చంద్రబాబు కలవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అది ఎవరైనా చేసేదే. రాజకీయ అవసరం ఎవరినైనా అలానే నడిపిస్తుంది. వాస్తవానికి చంద్రబాబు 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కన్ను గీటారు. ప్రేమ సందేశం పంపారు. అయినా బీజేపీ చలించలేదు. అప్పుడు అవసరమనిపించకపోవచ్చు. కానీ చంద్రబాబు తన ప్రయత్నాలను మాత్రం మానుకోలేదు. ఒకవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సంధి యత్నాలు, తనకు పరిచయమున్న ఆర్ఎస్ఎస్ నేతలతో ట్రై చేయిస్తూనే ఉన్నారు. కానీ కమలం పెద్దలు చంద్రబాబును కలిసేందుకు కూడా అంగీకరించలేదు.
దాని తర్వాతనే...
కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో కొంత బెరుకు బయలుదేరింది. కర్ణాటకలో ఏదీ పనిచేయలేదు. హిందుత్వాన్ని రెచ్చగొట్టినా వర్క్ అవుట్ కాలేదు. మోదీ ఇమేజ్ కూడా వెలవెల పోయింది. తమ వెనక టన్నుల కొద్దీ అసంతృప్తిని మోసుకుని తిరుగుతున్న కమలనాధులకు కర్ణాటక ఫలితాలు ఒకరకంగా షాకిచ్చాయనే చెప్పాలి. ఈ దశలో దేశంలో ఒక బలమైన పార్టీ మిత్రపక్షంగా ఉండాలని ఆ పార్టీ నాయకత్వం కోరుకోవచ్చు. అందులోనూ దక్షిణాదిన ఉన్న ఒకే ఒక రాష్ట్రం చేజారి పోయింది. ఇక ఏ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇక త్వరలో జరగనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే బీజేపీ కళ్లెదుట కనిపిస్తున్నాయి. ఈ రెండింటిలో ఒక్కదానిలోనైనా అధికారంలోకి వస్తే చాలు. దక్షిణాదిన తమ పరువు నిలబడుతుంది. అదే చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ప్రధాన కారణమని చెప్పకతప్పదు. తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. అయినా ఎంతో కొంత బలం పెంచుకోవడానికి, కనీసం సీట్ల సంఖ్యను అయినా గణనీయంగా పెంచుకునేందుకు టీడీపీ, జనసేన ఉపకరిస్తుందన్న అంచనాలతోనే కేంద్ర నాయకత్వం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమయిందని చెబుతున్నారు. కానీ ఒకసారి కాంగ్రెస్ చేసిన తప్పు మరొకసారి బీజేపీ చేస్తుందన్న వాదన కూడా లేకపోలేదు.
స్వయంకృతాపరాధమే...
2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో చంద్రబాబు కలిసినా ప్రయోజనం లేదు. అధికార టీఆర్ఎస్కు గతం కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. కాకుంటే ఖమ్మం లాంటి జిల్లాల్లో కొంత ప్లస్ అయింది. ఇప్పుడు అదే లెక్కలను బీజేపీ అధినాయకత్వం కూడా వేసుకుంటుంది. ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో టీడీపీకి ఓటు బ్యాంకు ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. కానీ అసలు విషయమేంటంటే... సాక్షాత్తూ చంద్రబాబే 2014 తర్వాత తెలంగాణలో పార్టీని పూర్తిగా వదిలేశారు. కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఇటీవల తెలంగాణలోనూ హడావిడి చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో అధికారంలోకి వచ్చినా, రాకపోయినా చంద్రబాబుకు పెద్దగా నష్టం లేదు. కానీ ఏపీలో మాత్రం బీజేపీ అవసరం ఉంది. దానికి ఓటు బ్యాంకు లేకపోయినా అన్ని రకాల సహకారం అవసరం. అందుకే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం నాలుగేళ్ల నుంచి వెంపర్లాడుతున్నారు. నిజానికి పొత్తు తెలంగాణలో బీజేపీకి నష్టమే. చంద్రబాబుకు కొంత ప్రయోజనం.
కేసీఆర్కు ఆయుధం...
బీఆర్ఎస్ అధినేత వద్ద సంక్షేమ పథకాలు తప్ప మరొకటి చెప్పుకోవడానికి ఏమీలేదు. సెంటిమెంట్ కూడా పనిచేయదని భావిస్తున్న తరుణంలో బీజేపీ, టీడీపీ, జనసేన తెలంగాణలో కలసి పోటీ చేస్తే మరొకసారి ఆంధ్రోళ్ల పెత్తనమంటూ కేసీఆర్ ఖచ్చితంగా జనంలోకి వెళతారు. తమపై దాడి చేయడానికి బీజేపీతో కలసి బాబు వస్తున్నాడని ప్రజలను నమ్మించడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. నీటి హక్కుల నుంచి నిధుల వరకూ తమకు అన్యాయం జరుగుతుందని ఆయన పెద్దయెత్తున ప్రచారం చేస్తారు. ఆ ఆయుధాన్ని ఆయనకు చేతికి అందించి నట్లవుతుంది. తెలంగాణలో ఒంటరిగా ఎదగాలని ఇప్పటి వరకూ చేసిన, చేస్తున్న ప్రయత్నాలు వృధా అయినట్లే. కేసీఆర్ ఈ కలయిక కోసం వెయిట్ చేస్తున్నారు. నిజంగా పొత్తు కుదిరితే కేసీఆర్ లక్కు మూడోసారి కూడా మామూలుగా ఉండదన్నది విశ్లేషకుల అంచనా.
ఆ ఓటు బ్యాంకు ఎక్కడ?
ఇక టీడీపీకి ఇప్పుడు ప్రత్యేకంగా ఓటు బ్యాంకు అంటూ ఏమీ లేదు. కేసీఆర్ను వ్యతిరేకించే వారంతా రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ వైపు చూస్తు న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకునే వారే టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా కనిపిస్తున్నారు. జనసేన కూడా అంతే. అసలు దానికంటూ ఒక ఓటు బ్యాంకు ఉందని చెప్పడానికి ఇప్పటి వరకూ ఎలాంటి ఎన్నికల్లో ఆ పార్టీ పాల్గొనలేదు. పైగా కేసీఆర్ను, ఆయన పాలనను తరచూ పొగిడే పవన్ను చూసిన తర్వాత ఆ పార్టీకి ఉన్న కొద్దో గొప్పో ఓట్లు కూడా కాంగ్రెస్, బీజేపీ పరమయ్యాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తు ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్న అంచనాలు వేసుకుంటే కమలం పార్టీకేనని స్పష్టంగా చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. టీడీపీ, బీజేపీ ఎన్నిసార్లు కలిశారు. ఎన్ని సార్లు విడిపోయారు. ఇది కొత్త కాదు. పాత కాదు. గతంలో టీడీపీతో కలసి కాంగ్రెస్ చేతులు కాల్చుకుంటే... ఈసారి ఆ పని బీజేపీ చేస్తుందనుకోవాలి. జెండాలు ఛేంజ్. పార్టీలు మారాయి. కానీ రిజల్ట్ మాత్రం రిపీట్. ఇదీ అసలు సంగతి. నిజంగా పొత్తు కుదిరితే కమలం నేతలు తెలంగాణలో ఇన్నాళ్లూ పడిన శ్రమ వృధా అవుతుందన్న చర్చ జోరుగా సాగుతుంది. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి మరి.
Next Story