అహ్మదాబాద్ పేరూ మారుతుందా..?
ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టాక ముస్లిం పేర్లతో ఉన్న ప్రాంతాల పేర్లు మార్చాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మారుస్తూ యూపీ మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇక తాజాగా ఫైజాబాద్ జిల్లా పేరును శ్రీ అయోధ్యగా మార్చనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.
గుజరాత్ కూడా.....
ఇక యూపీ బాటలోనే గుజరాత్ కూడా వెళుతున్నట్లు కనపడుతోంది. ఏకంగా ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ పేరునే మార్చి కర్ణావతిగా పెట్టాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ప్రకటించారు. ఇందుకోసం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. 11వ శతాబద్ధం వరకు కర్ణవతిగా పేరున్న ఈ ప్రాంతాన్ని చుళుక్య రాజు కర్ణ పాలించే వారు. తర్వాత ఈ ప్రాంతాన్ని సుల్తాన్ అహ్మద్ షా ఆక్రమించి తనపేరుతో అహ్మదాబాద్గా మార్చారు. అయితే, ముస్లిం రాజు పేరున్న ఈ నగరానికి తిరిగి పాత పేరునే పెట్టాలని భావిస్తున్నట్లు నితిన్ పటేల్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.