Mon Dec 23 2024 14:26:19 GMT+0000 (Coordinated Universal Time)
అఖిలప్రియ అరెస్ట్ ...దగ్గరుండి మరీ దాడి చేయించి
నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులే దాడికి దిగారు. నారా లోకేష్ యాత్ర సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
నంద్యాలలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై టీడీపీ వర్గీయులే దాడికి దిగారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా వచ్చిన లోకేష్ వద్దకు వచ్చిన ఏవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి అఖిలప్రియ అనుచరులు దాడి చేశారు. ఏవీ సుబ్బారెడ్డి, ఆయన మనుషులను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దాడి జరుగుతున్నప్పుడు అఖిలప్రియ అక్కడే ఉండి దాడి చేయాలని ప్రోత్సహించడం కొంత పార్టీ నేతలను ఆందోళనలో పడేశాయి. దీంతో పోలీసులు అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
నాగిరెడ్డి మరణం తర్వాత...
భూమా నాగిరెడ్డి మరణించిన నాటి నుంచి ఏవీ సుబ్బారెడ్డికి, మాజీ మంత్రి అఖిలప్రియకు మధ్య పడటం లేదు. ఆస్తుల వివాదంలో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. నాగిరెడ్డి ఆస్తులను ఏవీ సుబ్బారెడ్డి తన సొంతం చేసుకున్నాడని అఖిలప్రియ ఆరోపిస్తుంది. తనకు నాగిరెడ్డి అత్యంత సన్నిహితుడని, ఆయన ఆస్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. తన తండ్రి బినామీ పేరుగా ఏవీ పేరు కొన్ని ఆస్తులపై పెట్టారని అఖిల అంటోంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ పంచాయతీ నడిచింది. అఖిలప్రియకు మంత్రి పదవి దక్కగా, ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య ఈ పంచాయతీ తెగలేదు.
ఏవీపై కక్ష కట్టి...
దీంతో ఒకే పార్టీలో నాడు మిత్రులుగా ఉన్నవారు బద్ధ శత్రువులుగా మారారు. ఏవీ సుబ్బారెడ్డి పై దాడి జరగడం ఇది రెండో సారి. అంతకు ముందు ఒకసారి జరిగింది. అయితే తాను వచ్చే ఎన్నికల్లో నంద్యాల లేదా ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానని ఏవీ సుబ్బారెడ్డి ప్రకటిస్తుండటం కూడా అఖిలప్రియ వర్గానికి ఇబ్బందిగా మారింది. నంద్యాలలో తన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిని పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఈ కారణంతో సోదరుడు బ్రహ్మానందరెడ్డితో కూడా విభేదాలకు అఖిలప్రియ వెనుకాడలేదు. అలా నంద్యాల, ఆళ్గగడ్డ పంచాయతీలు వీరి మధ్య నడుస్తూనే ఉన్నాయి. ఆళ్లగడ్డలో కూడా ఏవీ సుబ్బారెడ్డి వేలు పెట్టడం అఖిల ప్రియ ఆగ్రహానికి కారణమయిందని చెబుతారు.
అఖిల అరెస్ట్....
ఇదిలా ఉండగా అఖిలప్రియను పోలీసులు ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు. అఖిలప్రియ తన అనుచరులతో చెప్పి మరీ దాడి చేయించడంతో ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఏవీ సుబ్బారెడ్డికి పెదవులపై రక్తం కూడా కారడంతో ఆయనను కారులో ఎక్కించి చికిత్స కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అఖిలప్రియ పీఏ మోహన్ ను కూడా వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలకు తరలించి ఆమెను విచారిస్తున్నారు. నంద్యాలలోని ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు టీడీపీ నేతలు ఎన్ఎండీ ఫరూక్, గౌరు వెంకటరెడ్డి రంగంలోకి దిగారు. ఈ ఘటనపై నారా లోకేష్ కూడా సీరియస్ అయినట్లు తెలిసింది.
Next Story