Mon Dec 23 2024 03:44:10 GMT+0000 (Coordinated Universal Time)
డాడీ నువ్వే... కరెక్ట్....?
అఖిలేష్ యాదవ్ మాత్రం ఒక్కసారి సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ములాయం వ్యూహాలు అఖిలేష్ కు లేకుండా పోయాయి.
తండ్రి రాజకీయాల్లో ఆరితేరిన వాడు. తండ్రి నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న రాజకీయాన్ని ఆయన కుమారుడు మాత్రం నేలపాలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో సైకిల్ పార్టీ చతికల పడటానికి అఖిలేష్ యాదవ్ కారణమన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. ములాయం సింగ్ యాదవ్ పార్టీ అధినేతగా ఉన్నంత కాలం యూపీలో ఎస్పీకి ఎదురు లేకుండా పోయింది. ములాయం సింగ్ యూపీకి మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
ఒక్కసారితోనే....
కానీ ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ మాత్రం ఒక్కసారి సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ములాయం వ్యూహాలు అఖిలేష్ కు లేకుండా పోయాయి. ములాయం సింగ్ యాదవ్ తొలిసారి జనతా పార్టీ నుంచి 1989 లో యూపీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తర్వాత ఆయన సమాజ్ వాదీ పార్టీ స్థాపించారు. అప్పటికే యూపీలో ఊపు మీదున్న కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ పార్టీ కావాలని భావించిన ములాయం సమాజ్ వాదీ పార్టీని పెట్టి సక్సెస్ అయ్యారు. 1993, 2003లో మరోసారి సమాజ్ వాదీ పార్టీ ని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు.
బ్లండర్ మిస్టేక్స్....
అఖిలేష్ యాదవ్ ఎదిగి వచ్చిన తర్వాత పార్టీలో ఆయన కీలకంగా మారారు. 2012 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ గెలిచింది. అయితే ఆ గెలుపు తన వల్లనేనన్న భ్రమలో ఉన్న అఖిలేష్ యాదవ్ కుటుంబాన్ని పక్కన పెట్టారు. సొంత బాబాయిని దూరం చేసుకున్నారు. ములాయంను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. లోక్ సభ ఎన్నికల్లో తనకు బద్ధ విరోధి అయిన బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పెద్దాయనను, మాయావతిని ఒకే వేదికపైకి ఎక్కించారు. రాజకీయంగా బ్లండర్ మిస్టేక్ చేశారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు తనదేనని బలంగా విశ్వసించిన అఖిలేష్ కు నిరాశే ఎదురయింది.
పునరాలోచించుకోవాలా?
తండ్రి మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పితే అఖిలేష్ యాదవ్ మాత్రం రెండుసార్లు వరసగా పరాజయాన్ని దిగ్విజయంగా తెప్పించగలిగారు. వ్యూహాల లోపం, కోటరీనే నమ్ముకోవడం, సొంత సామాజికవర్గంపైనే ఆధారపడటం వంటి కారణాలు అఖిలేష్ పార్టీ ఓటమికి గల కారణాలుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. కొడుకు కంటే తండ్రే బెటర్ అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి.
Next Story