Wed Dec 25 2024 04:57:24 GMT+0000 (Coordinated Universal Time)
ముహూర్తం ఎప్పుడో...?
ప్రస్తుతం అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపడతారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేస్తారా? ఎన్నికల వరకూ ఇదే కేబినెట్ ను కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు గులాబీ పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ తన మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. తొలి దశలో స్వల్ప సంఖ్యలో సభ్యులను తన కేబినెట్ లోకి తీసుకున్న కేసీఆర్, తర్వాత పూర్తి స్థాయి విస్తరణ చేపట్టారు. ఆ తర్వాత విస్తరణ రేపు, మాపు అంటూ దాదాపు ఏడాదిగా నానుస్తూ వస్తున్నారు.
ఈటలను బర్త్ రఫ్ చేసిన తర్వాత....
గత ఏడాది మే నెలలో ఈటల రాజేందర్ ను కేసీఆర్ మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేశారు. ఆయన శాఖను మంత్రి హరీశ్ రావుకు అప్పగించారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు మరో ముఖ్యమైన ఆర్థిక శాఖను కూడా హరీశ్ రావు చూస్తున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణ చేయడానికే తాత్కాలికంగా హరీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖను కేసీఆర్ అప్పగించారు. అయితే మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడో జరగాల్సి ఉంది.
ఎన్నికలు పూర్తయిన తరుణంలో....
ప్రస్తుతం అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. శాసనమండలి ఎన్నికలు కూడా పూర్తయి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపడతారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఇప్పటి వరకూ మంత్రి పదవి దక్కని వారు, ఎమ్మెల్సీలుగా ఎన్నికయిన వారు మంత్రి పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొందరికి కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారన్న టాక్ పార్టీలో ఉంది. ఆశావహులంతా ఆసక్తిగా విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు.
ఎన్నికల కేబినెట్....
పీవీ కుమార్తె సురభి వాణీదేవిని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం ఎప్పటినుంచో విన్పిస్తుంది. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం శ్రమిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి సయితం తాను రేసులో ఉన్నానని చెబుతున్నారు. సీనియర్ నేత దాస్యం వినయ భాస్కర్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్ లు కూడా తమకు మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. అయితే కేసీఆర్ మాత్రం ముహూర్తం ఇంకా ఖరారు చేయలేదు. ఎన్నికల కేబినెట్ ను కేసీఆర్ ఖచ్చితంగా రూపొందిస్తారని, అది ఎప్పుడనేది ఇప్పుడు గులాబీ పార్టీల నేతలను వేధిస్తున్న విషయం.
Next Story