Sat Nov 16 2024 19:44:35 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు ఫీడ్ బ్యాక్ ఇస్తుందంతా వారేనట
ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. వైసీపీ వన్ సైడ్ విజయం సాధించింది.
ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. వైసీపీ వన్ సైడ్ విజయం సాధించింది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ పెత్తనం వైసీపీదే. ప్రతిపక్షాల ఊసే లేకుండా పోయింది. ఎన్నికల్లో అక్రమాలు, బెదిరింపులు, అవకతవకలు అనిచెబుతున్నా 80 నుంచి 90 శాతం ఫలితాలు వైసీపీ వైపునే ఉన్నాయి. ప్రజలు జగన్ పక్షాన నిలిచారనే చెప్పాలి. ఇంత పెద్ద విజయాలు వైసీపీలో అతి విశ్వాసాన్ని పెంచుతాయని కొందరు అంటున్నారు. కానీ జగన్ రాజకీయం వేరు అంటున్నారు వైసీపీ నేతలు.
అంతకు ముందులా కాదు...
జగన్ ఇంతకు ముందులా కాదు. రాజకీయంగా రాటు దేలాడు. ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. జనంలోకి తన సంక్షేమ పథకాలు పనిచేస్తున్నాయని సంకేతాలను పంపారు. గెలుపుకు కారణం ఏదైనా కావచ్చు. గెలుపు మాత్రం జగన్ ఖాతాలోనే పడింది. సంక్షేమ పథకాల వల్లనే ఇంతటి విజయాలు సాధ్యమయ్యాయని పార్టీ నేతలకు కూడా పరోక్షంగా హెచ్చరికలు పంపారు. తన మాటే వేదం. శాసనం అన్నది జగన్ ఈ ఫలితాలతో చెప్పకనే చెప్పారు.
ఐదు మార్గాల నుంచి....
జగన్ కు అతి దగ్గరగా ఉన్న ఒక మంత్రి చెప్పిన దానిని బట్టి... జగన్ అధికారుల మాటలను నమ్మరు. తనకంటూ ఐదు రకాల సర్వే సంస్థలను జగన్ పెట్టుకున్నారు. ఐదు మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటాడు. ప్రజల్లో తన నిర్ణయంపై వ్యతిరేకత ఉందని ఆ సర్వేల్లో తేలితే వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవడానికి కూడా వెనుకడారట. అంతెందుకు ఇంటలిజెన్స్ సర్వేలు, అధికారుల సంతృప్తి నివేదికలను జగన్ అసలు చూడనే చూడరంటున్నారు జగన్ కు సన్నిహితంగా ఉండే ఆ మంత్రి.
ఎమ్మెల్యేలపై....?
ఇక జగన్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని గ్రహించారు. వారికి కొంత సమయం ఇవ్వనున్నారు. పనితీరు మార్చుకుని ప్రజల్లో విశ్వాసాన్ని పొందకపోతే నిర్దయగా వచ్చే ఎన్నికల బరి నుంచి తప్పించనున్నారు. ఈ మేరకు కొందరికి జగన్ సిగ్నల్స్ కూడా ఇచ్చారంటున్నారు. విజయాలను చూసి చంకలు గుద్దుకోవద్దని, ప్రజల్లో మార్పు ఒక్క రోజులో కూడా వస్తుందని జగన్ వారికి హెచ్చరికలు జారీ చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ ను తక్కువగా అంచనా వేస్తే తప్పులో కాలేసినట్లే. ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే జగన్ అందరినీ సిద్ధం చేస్తున్నారు.
Next Story