Fri Nov 29 2024 03:54:41 GMT+0000 (Coordinated Universal Time)
కోటంరెడ్డి లెక్క తప్పినట్లే
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రాజకీయంగా ఇక అన్ని దారులు మూసుకుపోయినట్లేనని తెలుస్తోంది
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రాజకీయంగా ఇక అన్ని దారులు మూసుకుపోయినట్లేనని తెలుస్తోంది. ఆయన తొందరపడి అధికార పార్టీ నుంచి బయటకు వచ్చారని ఆయన అనుచరుల్లో సయితం అభిప్రాయం బలంగా వ్యక్తమవుతుంది. నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి చేరికపై టీడీపీ నేతల నుంచి వ్యతిరేకం వ్యక్తం కావడంతో ఆయనను చేర్చుకోవడంపై పార్టీ అధినేత చంద్రబాబు కూడా కొంత పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. దీంతో కోటంరెడ్డి రాజకీయంగా అటు కాకుండా.. ఇటు కాకుండా.. ఎటూ కాకుండా పోయారన్న టాక్ సింహపురిలో బలంగా వినిపిస్తుంది.
నేతల అభ్యంతరంతో...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను టీడీపీలోకి వెళుతున్నట్లు నేరుగా కార్యకర్తల సమావేశంలోనే ప్రకటించారు. అయితే కోటంరెడ్డి రాకను పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. టీడీపీ టిక్కెట్ దక్కించుకని గెలిచిన తర్వాత తిరిగి వైసీపీ గూటికి కోటంరెడ్డి వెళ్లినా ఆశ్చర్యం లేదని వారు చంద్రబాబు వద్ద ఎదుట చెప్పినట్లు తెలిసింది. కోటంరెడ్డి పై పరోక్షంగా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా కామెంట్స్ చేశారు. కోవర్టులు వస్తున్నారంటూ జాగ్రత్తగా ఉండాలంటూ పార్టీ నేతలను ఆయన హెచ్చరించడం కూడా చర్చనీయాంశమైంది. స్థానిక టీడీపీ నేతలు కూడా కోటంరెడ్డికి వ్యతిరేకంగా సమావేశాలు పెడుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ...
కోటంరెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ వైసీపీ నుంచి బయటపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకు ఇక నియోజకవర్గంలో అన్ని రకాలుగా అధికార పార్టీ లాక్ చేసింది. వెంటనే ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించి అధికార యంత్రాంగం మొత్తం ఆదాల కనుసన్నుల్లోనే పని చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కోటంరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదు. అధికారులు ప్రొటోకాల్ కూడా పాటించడం లేదు. ఎన్నికలకు ఇంకా ఏడాది ముందుగానే కోటంరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయనను రాజకీయంగా ఇబ్బందుల పాలు చేసిందనే చెప్పాలి.
బాబు పాజిటివ్ గా లేరా?
ఇక వరసగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర పార్టీల నేతలకు కండువాలు కప్పుతున్నారు. కానీ కోటంరెడ్డి విషయంలో మాత్రం కండువా కప్పకపోయినా పాజిటివ్ గా లేరంటున్నారు. ఒక్క నేత వచ్చినంత మాత్రాన పార్టీ జిల్లాలో మరింత ఇబ్బందుల్లో పడుతుందని ఆయన భావిస్తున్నారు. టీడీపీకి కోటంరెడ్డి చేరిక వల్ల కొత్తగా వచ్చే లాభమేదీ లేదు. వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గత నాలుగేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న నేతలను ఇబ్బంది పెట్టి కోటంరెడ్డికి రెడ్ కార్పెట్ వేయడం సరికాదన్నది చంద్రబాబు భావనగా ఉంది. అందుకే కోటంరెడ్డి లెక్క తప్పిందంటున్నారు. ఆయన ఇప్పుడు మరో పార్టీవైపు చూడాల్సిందే. జనసేన కూడా అతనిని నమ్మి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అన్నది కూడా సందేహమే. ఇక కోటంరెడ్డికి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం మినహా మరో దారి లేదని చెబుతున్నారు. మరి కోటంరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండనుందన్నది రానున్న కాలంలో తెలియాల్సిందే.
Next Story