Mon Dec 23 2024 14:35:12 GMT+0000 (Coordinated Universal Time)
జేసీ బాబాయ్.. ఇక్కడ ఆ ఆటలు సాగవ్
అనంతపురం జిల్లాలో ఉన్న టీడీపీ నేతలందరూ సీనియర్ నేతలే. తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారే.
అనంతపురం జిల్లా రాజకీయాల నుంచి జేసీ కుటుంబాన్ని వేరు చేసి చూడలేం. వారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ తమ మాటే చెల్లుబాటు కావాలనుకుంటారు. కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కొందరి ముఖ్యమంత్రులకు అనుకూలంగా, మరికొందరికి వ్యతిరేకంగా పనిచేసిన చరిత్ర వారిది. వారు కేవలం తాడిపత్రికి మాత్రమే పరిమితమయ్యే నేతలు కాదు. జిల్లా అంతటా తమ వర్గం ఉండాలని కోరుకుంటారు. కాంగ్రెస్ లో అది చెల్లుబాటు అయింది. కానీ ప్రాంతీయ పార్టీల్లో అది సాధ్యం కాదు. అందునా తెలుగుదేశం పార్టీలో అసలు వర్క్ అవుట్ కాదు. అయినా జేసీ కుటుంబం తమ పోరాటాన్ని మాత్రం ఆపదు.
ఈ నియోజకవర్గాలపై....
అనంతపురం జిల్లాలో తాడిపత్రి, శింగనమల, అనంతపురం టౌన్, కల్యాణదుర్గం, పుట్టపర్తి వంటి నియోజకవర్గాల్లో తమ పట్టు నిరూపించుకోవాలన్నది వారి ఆలోచన. అందుకే ఆ నియోజకవర్గాల్లో వేలు పెట్టడం మానడం లేదు. ఇది పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాధరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జేసీ మాదిరి పల్లె ఇతర పార్టీల నుంచి రాలేదు. ఆయన సుదీర్ఘకాలం నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు.
మంత్రి పదవి కోసమేనా?
ఈ నేపథ్యంలో పల్లె రఘునాధరెడ్డి గెలవకూడదని, గెలిస్తే తమ కుటుంబానికి మంత్రి పదవి దక్కదన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలోచనగా ఉంది. నిజానికి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిలు ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నికల నుంచి 2019లోనే తప్పుకున్నారు. తాడిపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి, అనంతపురం పార్లమెంటుకు దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి తన పట్టు నిలుపుకునేందుకు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా పోటీ చేసి విజయం సాధించారు.
ఆ భ్రమలో....
రాష్ట్రంలో టీడీపీ గెలిచిన ఏకైక మున్సిపాలిటీగా తాడిపత్రిని నిలిపారు. అప్పటి నుంచి తనకు టీడీపీ లో తిరుగులేదన్న భ్రమలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. తాము లేకపోతే జిల్లాలో టీడీపీ లేదన్న అభిప్రాయంలో ఉన్నారు. కానీ అనంతపురం జిల్లాలో ఉన్న టీడీపీ నేతలందరూ సీనియర్ నేతలే. తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారే. అందుకే జేసీ ఆటలు టీడీపీ లో చెల్లవంటున్నారు జిల్లా టీడీపీ నేతలు. చంద్రబాబు కూడా వారి నోటికి భయపడి మౌనంగా ఉన్నారు తప్పించి, అధికారంలోకి వచ్చినా, రాకున్నా జేసీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story