Sat Dec 28 2024 12:00:14 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడు మహా యుద్ధం.. గెలుపెవరిది?
మునుగోడు ఉపఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ విజయం కోసం పోరాడుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విజయం కోసం నిరంతరం పోరాడుతున్నాయి. ఇక ఎన్నికలకు వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రచారాన్ని అన్ని పార్టీలూ ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకూ మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని చాలా తక్కువ సార్లు గెలిపించారు. ఎక్కువగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి చెందిన వారినే ఎన్నుకుంటూ వస్తున్నారు.
అధికార పార్టీ నుంచి...
2014లో మాత్రం మునుగోడు నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. అప్పుడు మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎక్కువగా సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నుంచి మాత్రమే ఇక్కడి నుంచి గెలిచారు. దీంతో నియోజకవర్గం అభివృద్ధి పెద్దగా జరగలేదన్న ప్రచారాన్ని టీఆర్ఎస్ చేస్తుంది. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో చెబుతూ వస్తుంది. పథకాలు కూడా అందరికీ అందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థిని మాత్రమే గెలిపించాలని నేతలు కోరుతున్నారు. మద్యం, డబ్బును లెక్కకు మించి ఖర్చు చేస్తున్నారున్న ఆరోపణలున్నాయి.
ఓటు బ్యాంకు లేకున్నా...
భారతీయ జనతా పార్టీ మాత్రం తమ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడు అభివృద్ధి బాధ్యతను తాము తీుకుంటామని చెబుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ తోనే ఇక్కడ నెగ్గుకురావాల్సి ఉంది. వాస్తవానికి ఇక్కడ బీజేపీకి ఓటు బ్యాంకు పెద్దగా లేదు. ఎప్పుడూ ఇక్కడ గెలిచిన పరిస్థితి కూడా లేదు. కేవలం కోమటిరెడ్డి ఇమేజ్ తోనే ఇక్కడ నెగ్గుకు రావడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. డబ్బులు కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రజలకు చెబుతూ ప్రచారాన్ని సాగిస్తుంది.
కాంగ్రెస్ మాత్రం...
కాంగ్రెస్ మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది. పాల్వాయి స్రవంతి పట్ల సానుభూతి పనిచేస్తుందని పార్టీ భావిస్తుంది. మిగిలిన పార్టీలతో డబ్బులతో పోటీ పడకపోయినా ప్రచారంలో మాత్రం తగ్గడం లేదు. కాంగ్రెస్ నేతలు గ్రామ గ్రామాన తిరిగుతూ స్రవంతిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా బీసీ, మహిళ ఓటర్లపైనే ఎక్కువగా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. రెండు పార్టీలపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ముందుకు వెళుతుంది. ఇంకా ప్రచారానికి కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతలందరూ మునుగోడులోనే మొహరించారు.
Next Story