Thu Nov 28 2024 22:48:46 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ .. ఏకాకిగా మిగిలిపోతారా?
సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ రేవంత్ కు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. దీంతో రేవంత్ ఒంటరిగా మిగిలారు
రేవంత్ రెడ్డి .. పీసీసీ చీఫ్ గా ఎంపికయి దాదాపు రెండేళ్లు గడుస్తుంది ఆయన 2021 జూన్ నెలలో పీీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ నుంచే ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా కార్యక్రమాలు చేపట్టింది అంటే అదీ లేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మినహా పెద్ద కార్కక్రమాలను చేపట్టలేదు. అలాగే ఈ రెండేళ్లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఊడబెడ్చిందీ ఏమీ లేదు. అన్ని ఎన్నికల్లో ఓటమి తప్ప మరేదీ లేదు. ఒకరినొకరిపై ఫిర్యాదులు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం మినహా పెద్దగా సాధించిందేమీ లేదు. కానీ ఇప్పుడు ఏకంగా తిరుగుబాటుకు దిగారు.
తొలిసారి అందరూ...
కానీ విమర్శలు చేసుకున్నా, ఫిర్యాదులు ఇచ్చినా అది పెద్దగా ఫోకస్ కాలేదు. తొలిసారి రేవంత్ కు వ్యతిరేకంగా అందరూ ఒకటయ్యారు. ఇప్పుడు పార్టీలో పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అని రెండు వర్గాలుగా విడిపోయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకూ కొంత సంయమనంతో వ్యవహరించిన నేతలు కూడా ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకూ కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి వంటి వారే రేవంత్ పై నేరుగా విమర్శలు చేసేవారు. అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసేవారు.
సీనియర్ నేతలందరూ...
కానీ ఇప్పుడు అలా కాదు. ఏకంగా మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ వ్యతిరేక వర్గంలో జాయిన్ అయ్యారు. అంతేకాదు కొంత సాఫ్ట్ గా ఉండే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సయితం గొంతు కలిపారు. దామోదర రాజనర్సింహ, మధుయాష్కి ఇలా ఒక్కరేమిటి సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ రేవంత్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీనికంతటికీ కారణం ఇటీవల భర్తీ అయిన కమిటీల నియామకమే కారణమని చెప్పకతప్పదు. ఎక్కువ మందికి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే కమిటీల్లో స్థానం కల్పించడం పట్ల వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సేవ్ కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. అసలు కాంగ్రెస్ తమదేనంటూ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ సారథ్యంలో ముందుకు నడవటం కష్టమేనన్నది ఆ పార్టీ నేతల నుంచే వినపిస్తున్న మాట. "ఆయన చెబితే మేం వినం. మేం చెప్పినట్లు ఆయన వినరు. ఇక ఈ పార్టీ గతి అంతే" అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
అంతా ఆయనవల్లే...
అయితే దీనికంతటికీ ప్రధాన కారణం రాష్ట్ర వ్యవహారా ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ అని చెప్పక తప్పదు. పార్టీ వ్యవహారాలను చూసుకోవాల్సిన మాణికం ఠాగూర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కమిటీల నియామకం చేపట్టే సమయంలో కనీసం సీఎల్పీ నేత, మాజీ పీసీసీ చీఫ్ లను కొందరినైనా సంప్రదించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందునే ఈ పరిస్థిితి తలెత్తిందని చెప్పక తప్పదు. పార్టీలో అందరి నేతలసు సమన్వయం చేసుకు వెళ్లాల్సిన మాణికం ఠాగూర్ తన ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారని ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. ఇప్పుడు గళమెత్తిన నేతల్లో ఎవరూ పార్టీకి పెద్దగా కష్టపడి పనిచేసిన సందర్భమూ లేదు. అలాగని వారిని విస్మరిస్తే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ప్రజల్లో పార్టీ మరింత చులకనగా మారిపోతుందని చెప్పక తప్పదు.
Next Story