Thu Dec 19 2024 05:08:09 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ను బాగానే గోకుతున్నట్లుందే?
కేంద్ర మంత్రులు ఒక్కొక్కరూ తెలంగాణలో తిరుగుతూ కేసీఆర్ కు నిద్ర లేకుండా చేయాలని చూస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు ప్రధాన శత్రువు బీజేపీయే. జాతీయ స్థాయిలో బీజేపీని ఇబ్బంది పెట్టాలని కేసీఆర్ అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. అక్కడ మీడియా మీట్ లు పెట్టి మోదీ పాలనపై ధ్వజమెత్తుతున్నారు. పెట్రోలు ధరల నుంచి గ్యాస్ తో పాటు నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను ప్రస్తావిస్తూ మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీలుచిక్కినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ జాతీయ స్థాయిలో బద్నాం చేయడానికి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నారు.
రంగంలోకి కేంద్రమంత్రులు...
అయితే కేసీఆర్ కు విరుడుగా బీజేపీ కూడా కేంద్ర మంత్రులను రంగంలోకి దించుతుంది. ఏ రాష్ట్రంలో పర్యటించని విధంగా కేంద్ర మంత్రులు ఒక్కొక్కరూ తెలంగాణలో తిరుగుతూ కేసీఆర్ కు నిద్ర లేకుండా చేయాలని చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఏకంగా మూడు రోజుల పాటు పర్యటించి కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. రేషన్ షాపు దగ్గర నుంచి రైతు సమస్యల వరకూ నిర్మలమ్మ వదిలిపెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆర్థికమంత్రి కావడంతో లెక్కలు చెప్పి మరీ మంత్రులను సయితం ఇరిటేట్ చేసి వెళ్లిపోయారు. మోదీ ఫొటో పెట్టలేదేమిటని ఏకంగా జిల్లా కలెక్టర్ నే నిలదీసి ఐఏఎస్ లకు పరోక్షంగా కేంద్రమంత్రి సంకేతాలు పంపారంటున్నారు.
కేసీఆర్ ను ఇరిటేట్ చేస్తూ...
మరో కేంద్రమంత్రి మహేంద్ర నాధ్ పాండే మహబూబ్ నగర్ జిల్లాలో ఆసుపత్రిని పరిశీలించారు. మోదీ ఫొటో ఎందుకు లేదని ఆయన కూడా ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు వరసగా పర్యటనలు చేస్తూ కేసీఆర్ పై కవ్వింపు చర్యలకు దిగుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నిజానికి కేసీఆర్ తాను గోకుతూనే ఉంటానని ఆ మధ్య మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యకు ప్రతిగా కేంద్ర మంత్రులు వచ్చి మరీ గోకి వెళుతున్నారు. పథకాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. వివిధ వర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్ర మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణలో బీజేపీకి కొంత హైప్ క్రియేట్ తెస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
క్లస్టర్లుగా విభజించి...
తెలంగాణపై పట్టు సాధించేందుకు బీజేపీ కొన్ని రోజుల క్రితమే రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించింది. తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లోనే నిర్వహించి కేసీఆర్ తో కయ్యానికి కమలం పార్టీ కాలు దువ్వింది. దీనికి తోడు ప్రతి క్లస్టర్ లో కేంద్ర మంత్రులు తరచూ పర్యటిస్తూ రెండు రోజుల పాటు అక్కడే మకాం వేయాలని కూడా కేంద్ర నాయకత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించిన పార్టీ అధినాయకత్వం వాటికి ఇన్ఛార్జులను నియమించింది. ఆదిలాబాద్ క్లస్టర్ కు కేంద్ర మంత్రి హర్షోత్తం ఖోడా భాయ్, హైదరాబాద్ క్లస్టర్ కు కేంద్ర మంత్రి వెంకటేష్ జోషి, మహబూబ్ నగర్ క్లస్టర్ కు మహేంద్ర నాధ్ పాండే, వరంగల్ క్లస్టర్ కు మరో కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ఇన్ఛార్జులుగా వ్యవహరిస్తారు. వీరితో పాటు తరచూ కేంద్ర మంత్రులు పర్యటిస్తూ .. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కేసీఆర్ ను ఇరిటేట్ చేస్తున్నారు.
Next Story