Sat Jan 04 2025 15:22:14 GMT+0000 (Coordinated Universal Time)
సిగ్నలింగ్ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే...!!
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖరారయింది. మూడు పార్టీలూ ఒకే ట్రాక్ మీద పరుగులు తీయడానికి దాదాపుగా సిద్ధమయ్యాయి
ఒడిశా రైలు ప్రమాదం అందరినీ కలిచి వేసింది. ఒక రైలు పట్టాలు తప్పితే... వేగంతో వచ్చిన మరొక రైలు ఢీకొట్టింది. అదే ట్రాక్‌లో వచ్చిన మరొక రైలు కూడా ఢీకొట్టింది. దీంతో మూడు రైళ్లు ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. జన నష్టం జరిగింది. రైల్వేశాఖకు కూడా అపారనష్టం వాటిల్లింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... అది పెను విషాదం. మరణించిన కుటుంబాల్లో ఎవరూ పూడ్చలేని అగాధాన్ని ఆ ప్రమాదం నింపింది. అయితే ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలోనూ కనిపిస్తుంది. అయితే అది రైల్వేలో జరిగిన ప్రమాదం కాగా.. ఇది పాలిటిక్స్‌లో జరుగుతున్న పరిణామం. రెండింటినీ పోల్చడం కరెక్ట్ కాకపోవచ్చు... కానీ పాఠకులు కనెక్ట్ అయ్యేందుకు పోల్చడం తప్పేమీ కాదనిపించే ఇలా చేయాల్సి వస్తుంది.
ఏపీ పాలిటిక్స్‌లోనూ...
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లోనూ ఒడిశా రైలు ప్రమాదం వంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖరారయింది. మూడు పార్టీలూ ఒకే ట్రాక్ మీద పరుగులు తీయడానికి దాదాపుగా సిద్ధమయ్యాయి. అయితే దీనిని ప్రమాదంగా మాత్రం చెప్పలేం. పరిణామం మాత్రంగానే చూడాలి. ఒకే ట్రాక్‌పై పరుగులు పెడితే 2014లో సూపర్ విక్టరీ లభించింది. ఆరోజు సిగ్నలింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేసిందనుకోవాలి. కానీ నేడు సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా ఉందా? లేదా? అన్నదే ప్రశ్న. అది లేకుంటే పట్టాలు తప్పడం ఖాయం. బోగీలు తిరగబడినట్లు పార్టీల జాతకాలు కూడా తిరగబడటం కూడా అంతే నిజం. ప్రజల మూడ్ ను బట్టి ఎన్నికల ఫలితాలు ఉంటాయి. 2014 పరిస్థితులు కూడా ఇప్పుడు ఉన్నాయనుకోవడానికి వీలులేదు. అలాగని ఖచ్చితంగా గోల్ ను రీచ్ కాలేరనీ చెప్పలేం. ఏదైనా జరగొచ్చు. ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపితే దానినే విజయం వరిస్తుంది.
బాబు స్కూల్ వేరు...
ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు అంటూ ఏమీ లేదు. కానీ చంద్రబాబు కమలం పార్టీతో పొత్తుకు తహతహ లాడేది జగన్ ఎదుర్కొనడం కోసమే. ఈ ఏడాదిలో బీజేపీతో కలసి జగన్ జాతకాన్ని మార్చాలన్నది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు స్కూలు సిలబస్ ప్రత్యేకంగా ఉంటుంది. అది అందరికీ అర్ధమయినట్లే ఉంటుంది. కానీ పరీక్షలకు కూర్చున్నప్పుడు సిలబస్ గుర్తుకు రాదు. అదే ఇప్పుడు జగన్‌కు కూడా అనిపించి ఉంటుంది. నాలుగేళ్లుగా చంద్రబాబును బీజేపీ దూరం పెట్టడంతో జగన్‌లో కొంత విశ్వాసం నెలకొంది. అయితే బీజేపీ అవసరం వేరు. జగన్ తమతో కలవరు. చంద్రబాబు అయితే తమతో కలసి అధికారాన్ని అక్కడా... ఇక్కడా పంచుకుంటారు. రాజకీయాల్లో నమ్మకం ముఖ్యం కాదు. అవసరమే అత్యంత ప్రాధాన్యం. చంద్రబాబు నమ్మకమైన మిత్రుడు కాకపోవచ్చు. కానీ అంతకు మించి ఆప్పన్ బీజేపీకి లేదు. చంద్రబాబుతో కలసి పోటీ చేస్తే నాలుగైదు పార్లమెంటు స్థానాలైనా దక్కుతాయి. అలాగే శాసనసభలోనూ ఒకరో ఇద్దరో తమ పార్టీ ప్రతినిధులు కనపడతారు.
అందుకే బీజేపీ....
కానీ జగన్‌తో అలాంటిది సాధ్యం కాదు. ఎందుకంటే జగన్ నేరుగా కలవరు. కాంగ్రెస్‌కు జగన్ బద్ధశత్రువని బీజేపీకి తెలియంది కాదు. ఒకవేళ అవసరమైతే జగన్‌తో సత్సంబంధాలు నెరపడం కమలనాధులకు పెద్ద కష్టమేమీ కాదు. జగన్ నమ్మకంగా ఉంటారని తెలిసినా చివరకు రాజకీయాల్లో లెక్కలే గెలుస్తాయి. ఏపీ నుంచి ఎన్ని సీట్లు తెచ్చుకుంటే పార్లమెంటులో అంత బలం తమకు ఉన్నట్లు. అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ పెద్దలు సిద్ధమయ్యారనే చెప్పాలి. అయితే ఏపీలో పొత్తు బీజీపీికి లాభం. చంద్రబాబుకు ఒకరకంగా నష్టం. పార్లమెంటు స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలను కూడా వారికి అప్పగించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ కష్టపడిన తమ పార్టీ నేతలకు అన్యాయం చేయాల్సి ఉంటుంది. అయినా చంద్రబాబుకు ఇది ఆఖరి ఛాన్స్. అందుకే అన్నింటినీ వదులుకునేందుకే సిద్ధమయ్యారు. ఇప్పుడు తాను పొత్తుకు సిద్ధపడుతున్నారు కాబట్టి బీజేపీ అడిగిన సీట్లు.. కోరిన స్థానాలను ఇవ్వాల్సి ఉంటుంది. బెట్టు చేయడం ఇప్పుడు బీజేపీ వంతయింది. పట్టువిడుపుగా వ్యవహరించడం చంద్రబాబు వైపు టర్న్ అయింది. మరి మూడు పార్టీలు ఒకే ట్రాక్‌లో ప్రయాణిస్తే ...అంటే పొత్తుతో బరిలోకి దిగితే ప్రమాదం ఎవరికైనా జరగొచ్చు. అది జగన్ కైనా.. లేదా.. ఈ మూడు పార్టీలకైనా... మరి చూడాలి.
Next Story