Mon Dec 23 2024 10:24:29 GMT+0000 (Coordinated Universal Time)
నిజమా...? నిందలా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు నాలుగేళ్లు కావస్తుంది. అయితే ఆయన హత్యకు గల కారణాలు ఇంతవరకూ బయటకు తెలియలేదు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు నాలుగేళ్లు కావస్తుంది. అయితే ఆయన హత్యకు గల కారణాలు ఇంతవరకూ బయటకు తెలియలేదు. కానీ వైఎస్ వివేకాపై మాత్రం ఒకటి కాదు రెండు కాదు అనేకమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవి నిరాధారమైన ఆరోపణలు కావచ్చు. నిజమే కావచ్చు. కాని వైఎస్ వివేకా మంచి మనిషి అని ప్రజలకు తెలుసు. ప్రజాసమస్యల పట్ల ఆయనకు అవగాహన ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన సోదరుడిపై నమ్మకం ఉంచి ఆయనకు తగిన రీతిలో ప్రాధాన్యత కల్పించారు. అయితే జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన కాంగ్రెస్ లోనే మంత్రి పదవి కోసం కొనసాగడం కొంత చర్చనీయాంశమైనా చివరకు వైసీపీలో చేరి జగన్ కు అండగా నిలిచారు.
వ్యక్తి గత కక్షతోనే...
శానసనమండలి సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా వైఎస్ వివేకానందరెడ్డి పనిచేశారు. పులివెందులతో పాటు కడప జిల్లాలో మంచి పేరున్న రాజకీయ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అయితే వివేకా 2019 మార్చి 15వ తేదీన హత్యకు గురయ్యారు. ఎంతగా అంటే గొడ్డలి, కత్తులతో ఆయనను దుండగులు నరికారు. అయితే హత్య జరిగిన తీరు చూస్తే రాజకీయ కోణం కన్నా వ్యక్తిగతమైన శత్రుత్వమే ఆయను అలా కసి తీరా చంపి ఉంటారన్నది ప్రతి ఒక్కరికీ తెలుసు. అది స్థలం వివాదం కావచ్చు. బెంగళూరులో ఒక భూమి సెటిల్ మెంట్ వివాదంలో ఈ హత్య జరిగినట్లు కూడా తొలుత ఆరోపణలు వినిపించాయి. సెటిల్ చేసిన తర్వాత తమకు డబ్బులు ఇవ్వలేదన్న కసితో దుండగులు పగ పట్టి హత్య చేశారని చెబుతారు కొందరు. అందులో నిజానిజాలు ఏమిటో ఇంత వరకూ తేలలేదు. కోట్ల రూపాయల సెటిల్ మెంట్ జరిగింది కాబట్టి నిందితులు అంతకసిగా పొడిచి పొడిచి చంపి ఉండవచ్చని అనుకున్నారు కూడా.
అక్రమ సంబంధాలు...
కానీ రాను రాను పెద్దాయనపై అక్రమ సంబంధాలు అంటకడుతూ ప్రచారాలు జరుగుతున్నాయి. 67 ఏళ్ల వయసులో వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. ఆయన గతంలోనే ఒక ముస్లిం మహిళతో సంబంధం ఉందని, 2011లో ఆమెను వివాహం చేసుకున్నారని, షేక్ పేరు కూడా మార్చుకున్నారని, మహ్మద్ అక్బర్ గా మార్చుకున్నారని, మతం కూడా మార్చుకున్నారని స్వయానా వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నారన్నారు. ఆస్తి తగాదాల కారణంగానే బాబాయి హత్య జరిగి ఉండవచ్చని అవినాష్ రెడ్డి ఆరోపించడంతో వైఎస్ వివేకా పరువును తీసేసినట్లయింది. ఇన్నాళ్లూ తాము బయటకు చెప్పలేక పోవడానికి కారణం కుటుంబం పరువు పోతుందనేనని కూడా అవినాష్ రెడ్డి చెప్పడం గమనార్హం.
లైంగిక వేధింపులు...
ఇక తాజాగా మరో లైంగిక సంబంధమైన ఆరోపణ కూడా వెలుగులోకి వచ్చింది. ఈకేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ తల్లిని వివేకానందరెడ్డి లైంగిక వేధింపులకు గురిచేశాడని అందువల్లనే సునీల్ యాదవ్ చంపాడని వైఎస్ భాస్కర్ రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలపడంతో మరో సంచలనానికి దారి తీసింది. అయితే వైఎస్ వివేకా హత్య కేసులో ఇలాంటి ఆరోపణలు వినిపించడం వైఎస్ కుటుంబానికి తలవంపులు తెచ్చేవే. అయితే తమనే నిందితులుగా మార్చాలన్న ప్రయత్నాలు జరుగుతుండటంతోనే ఆరోపణలు బయటపెడుతున్నామంటున్నారు. కానీ 67 ఏళ్ల వయసులో పెద్దాయనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.
క్యారెక్టర్ దెబ్బతీసేలా...
చనిపోయిన వారిపై ఇంత నిర్దాక్షిణ్యంగా ఆరోపణలు చేస్తారా? ఆయన క్యారెక్టర్ దెబ్బతీసేలా వ్యవహరిస్తారా? అంటూ వైఎస్ వివేకా కుమార్తె కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వివేకా హత్య కేసులో అసలు కారణాలు ఏవన్నది సీబీఐ ఇంతవరకూ తేల్చకపోయినా ఆ కుటుంబంపై మాత్రం అక్రమ సంబంధాల ఆరోపణలు రావడం వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదైనా అది కుటుంబ వ్యవహారం కావడంతో బయటపడటం లేదు కానీ.. కసిగా హత్య చేయడానికి రాజకీయ కారణాలకంటే.. వ్యక్తి గత కారణాలే ఎక్కువన్నది మాత్రం నిజమని అంటున్నారు. మరి ఏది నిజం..? ఏది అసత్యం..? తేల్చాల్సింది ఇక సీబీఐనే.
Next Story