Mon Dec 23 2024 15:35:32 GMT+0000 (Coordinated Universal Time)
రాజీనామాలు... రాజధాని రైతులకు చెక్..?
అమరావతి రైతుల మహా పాదయాత్ర ఉత్తరాంధ్ర చేరుకోక ముందే హీటెక్కుతుంది
అమరావతి రైతుల మహా పాదయాత్ర ఉత్తరాంధ్ర చేరుకోక ముందే హీటెక్కుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వికేంద్రీకరణకు అనుకూలంగా రాజనామాలకు కూడా సిద్ధమవుతున్నారు. నిన్న ధర్మాన ప్రసాదరావు జగన్ అనుమతిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈరోజు తాజాగా ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అవంతి శ్రీనివాసరావులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్ లో లేఖలు జేఏసీ కన్వీనర్ లజపతి రాయ్ కు అందజేశారు. వాటిని స్పీకర్ కు పంపాలని వారు సూచించారు.
వికేంద్రీకరణ జేఏసీ...
రాజకీయ పార్టీలకు అతీతంగా వికేంద్రీకరణ జేఏసీ ఏర్పాటయింది. ఈ నెల15న విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా పెద్దయెత్తున ర్యాలీ నిర్వహించాలని కూడా నిర్ణయించింది. త్వరలో మండల, గ్రామ స్థాయి జేఏసీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఒక రకంగా అమరావతి రైతుల మహా పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించకముందే యుద్ధం ప్రకటిస్తున్నారు. ఉద్రిక్త వాతావరణం ఖచ్చితంగా ఏర్పడుతుంది. దశాబ్దాల తర్వాత రాజధాని విశాఖకు వస్తుంటే టీడీపీ అడ్డుకుంటుందన్న ప్రచారాన్ని వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.
గతంలో జరిగిన...
అమరావతి రైతుల మహాపాదయాత్ర గతంలో న్యాయస్థానం టు దేవస్థానం జరిగింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా తిరుపతి వరకూ చేరుకుంది. ఈ యాత్రలో వారికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. పైగా కొంత సానుకూలత ఏర్పడిందన్న ప్రచారం జరిగింది అయితే ఈసారి మాత్రం అమరావతి టు అరసవెల్లి పాదయాత్రలో మాత్రం ఉద్రిక్తతలు తప్పేట్లు లేవు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల వరకూ పరవాలేదు కాని, ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుందని, జనం నుంచి వారికి సహకారం అందకూడదన్న ప్రయత్నంలోనే జేఏసీ ఏర్పాటయిందని భావించవచ్చు.
ఉత్తరాంధ్రలో మాత్రం...
మూడు రాజధానుల అంశాన్ని వచ్చే ఎన్నికల్లో బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్న వైసీపీకి ఈ రైతుల మహాపాదయాత్ర ఒక అవకాశంగా దొరికింది ప్రొఫెసర్లు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజాసంఘాలతో జేఏసీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం వెనక ఉద్దేశ్యం కూడా ఇదే. తమకు పరిపాలన రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్న సంకేతాలను తీసుకెళ్లడమే వీరి లక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామాలు చేయాలన్న వత్తిడిని కూడా పెంచుతున్నారు. మొత్తం మీద రైతుల మహాపాదయాత్ర ఉత్తరాంధ్రలో ఎలా సాగుతుందన్న టెన్షన్ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.
Next Story