Fri Dec 20 2024 03:59:41 GMT+0000 (Coordinated Universal Time)
ts liberation day celebrations : ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే
ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఇన్నాళ్లూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు
ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఇన్నాళ్లూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు స్వాతంత్ర్యం తెచ్చి పెట్టిన పటేల్ కు వందనాలు అని అన్నారు. సర్దార్ పటేల్ చొరవతోనే ఆపరేషన్ పోలో జరిగిందన్నారు. నిజాం, రజాకార్ల అరాచకాలకు సర్దార్ పటేల్ అడ్డుకట్ట వేశారన్నారు. పటేల్ పోరాటంతోనే నిజాం తలవంచారని తెలిపారు.
పటేల్ లేకుంటే...
పటేల్ లేకుంటే మరింత సమయం పట్టేది అని అన్నారు. ఈరోజు కొందరు వివిధ పేర్లతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారని అమిత్ షా అన్నారు. విమోచన దినోత్సవాలను నిర్వహించేందుకు అన్ని పార్టీలూ భయపడ్డాయని అన్నారు. వేడుకలు నిర్వహించాలంటే ఇప్పటికీ కొందరు భయపడుతున్నారన్నారు. తెలంగాణ విమోచన దినం అనేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన శుభాకాంక్షలు అని ఆయన తెలిపారు. ఏడాది పాటు ఈ ఉత్సవాలు నిర్వహించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
25 ఏళ్ల నుంచి ఎదురు చూపులు....
1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ లో జెండా ఎగురవేస్తే, 74 ఏళ్ల తర్వాత అమిత్ షా ఎగుర వేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 25 ఏళ్ల నుంచి ఈ వేడుకలు జరుపుకునేందుకు ఎదురు చూస్తున్నామని తెలిపారు. 1948లో నిజాంను ఓడించి జాతీయ జెండాను ఎగుర వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బలయిపోయారన్నారు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యమని కిషన్ రెడ్డి అన్నారు. భారత ప్రభుత్వం ఆజాదీ అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విమోచన వేడులకను జరుపుకోనివ్వలేదని ఆయన అన్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కర్ణాటక మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ హైదరాబాద్, కర్ణాటకలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం శుభపరిణామని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ ఈరోజు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని అన్నారు.
Next Story