బ్రేకింగ్ : సమ్మె విరమణ.. ప్రకటించిన ఉద్యోగ సంఘాలు
ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. ఏడో తేదీ నుంచి మొదలు కావాల్సిన సమ్మెను విరమించినట్లు ప్రకటించారు.
ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆరోతేదీ అర్ధరాత్రి నుంచి మొదలు కావాల్సిన సమ్మెను విరమించినట్లు ప్రకటించారు. రెండో రోజు సుదీర్ఘంగా మంత్రుల కమిటీ, పీఆర్సీ సాధన కమిటీ నేతల మధ్య చర్చలు జరిగాయి. దాదాపు ఏడుగంటల పాటు జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఉద్యోగులు కోరిన పీఆర్సీని ఇవ్వలేకపోయామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటుందని చెప్పారు. అన్ని సంఘాలతో అన్ని సమస్యలపై సవివరంగా మాట్లాడమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పీఆర్సీ శ్లాబుల్లో కూడా సవరణలను చేశామని చెప్పారు. నాలుగు శ్లాబులుగా వర్గీకరించామని చెప్పారు. ఫిట్ మెంట్ 23 శాతం ఇస్తున్నామని చెప్పారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలోనూ మార్పులు చేశామని చెప్పారు. ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదిక ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఐదేళ్లకే పీఆర్సీని అమలు చేసేందుకు నిర్ణయించామన్నారు. అంత్యక్రియల ఖర్చును కూడా ఇచ్చేందుకు నిర్ణయించామని చెప్పారు. సీపీఎస్ రద్దుకు సంబంధించి మార్చి 31నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగులకు వీలయినంత మేలు చేకూర్చేందుకే ప్రయత్నించామని ఆయన తెలిపారు.