Sat Nov 23 2024 04:19:19 GMT+0000 (Coordinated Universal Time)
ఆనం గరం.. గరం.. మార్చిలో నిర్ణయం
ఆనం రామనారాయణరెడ్డి సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారు. వైసీపీలో ఉండాలా? బయటకు వెళ్లాలా? అన్న దానిపై చర్చిస్తున్నారు
ఆనం రామనారాయణరెడ్డి సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారు. వైసీపీలో ఉండాలా? బయటకు వెళ్లాలా? అన్న దానిపై ఆయన చర్చిస్తున్నారు. గత కొంతకాలంగా ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పలు వేదికలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడంతో పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. వెంకటగిరి ఇన్ఛార్జిగా ఆనం రామనారాయణరెడ్డిని కాకుండా నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించింది.
వైసీపీని వీడటం...
అయితే దీనిపై ఆగ్రహంతో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి మార్చిలో నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు. వైసీపీని వీడటం దాదాపుగా ఖాయమయింది. అయితే ఏ పార్టీ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తికరంగా మారింది. తాజాగా గడపగడపకు ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడమే కాకుండా నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. దీంతో వైసీపీ నుంచి తాను క్విట్ కాక తప్పదని ఆనం భావిస్తున్నారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా తన లాంటి వ్యాఖ్యలు చేసినా వారిని పిలిచి చర్చించిన ముఖ్యమంత్రి తన విషయంలో మాత్రం అలాంటిదేమీ చేయకపోవడంపై ఆనం అసంతృప్తి మరింత ఎక్కువయిందంటున్నారు.
పార్టీ కార్యక్రమాలకు....
ప్రస్తుతానికి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆనం రామనారాయణరెడ్డి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. సన్నిహితులతో చర్చించి నెల్లూరు టౌన్, ఆత్మకూరుల్లో ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేయాలని ఆనం రామనారాయణరెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇందుకు అంగీకరిస్తుందా? లేదా? అన్నది కూడా చూడాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ మినహా మరో అవకాశం ఆనంకు లేదు. ఆ పార్టీకి కూడా జిల్లాలో ఆనం అవసరం ఉండటంతో తన ఎంట్రీకి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నెల్లూరు జిల్లా నేతలు కొందరు ఆనంతో టచ్ లోకి వెళ్లారని తెలిసింది.
వైసీపీ కీలకనేతపై...
అయితే ఎప్పుడు ఏ రూపంలో వెళ్లాలన్న దానిపై మాత్రం ఆనం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తనను అనేక అవమానాలకు గురి చేసిన వైసీపీపై వెళుతూ వెళుతూ పెద్ద పెద్ద ఆరోపణలు చేసి వెళతారన్నది మాత్రం సింహపురి నుంచి వినిపిస్తున్న టాక్. అయితే ఆరోపణలు ఎవరిపై ఉంటాయి? ఏ రూపంలో ఉండాయన్నది మార్చి నెలలో స్పష్టత రానుందని తెలుస్తోంది. వైసీపీలోని ప్రధాన నేతపైనే ఆనం ఆరోపణలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాను కాకుండా తన వారసులను పోటీకి దింపే ఆలోచన కూడా ఆనం రామనారాయణరెడ్డి చేస్తున్నట్లుంది. మరి చివరకు ఆనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story